ముంబై: విధి వక్రిస్తే ఎంతటి వారైనా కూలబడక తప్పదు. కాలం కలిసిరాక పోతే ఎవరు ముందైనా అర్రులు చాస్తూ చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ఇటువంటి విషాద గాథే మన మీనాక్షి విషయంలో జరిగింది. ఇంతకీ ఆమె ఎవరో అనామకురాలు మాత్రం కాదు. ఒకప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ గా పని చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 2011లో అకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్తను కోల్పోవడమే కాకుండా, తన కాలికి కూడా తీవ్రంగా గాయకావడంతో ఉన్నతమైన ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. ఉన్న తన సొంత ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులు కూడా ఆమె వైద్య ఖర్చులకే సరిపోవడంతో ప్రస్తుతం పదేళ్ల కుమారుడితో 'ఒంటరి' గా పోరాడుతోంది.
ఈ విషయాన్నిఆమె క్రీడల మంత్రి నారద్ రాయ్ దృష్టికి తీసుకు వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీన మంత్రిని కలిసిన ఆమె తన ప్రస్తుతం పడుతున్న కష్టాలను కన్నీళ్ల రూపంలో వెళ్లగక్కింది.' నేను సర్వం కోల్పాయను. నా వద్ద తాకట్ట్టు పెట్టడానికి తల తప్ప ఇంకా ఏమీలేదు. నాకు ఉద్యోగం కల్పిస్తే, పదేళ్ల బాబుతో జీవితాన్ని గడపడానికి దారి చూపించిన వారవుతారు' అని అభ్యర్థించింది. క్రీడాశాఖా మంత్రి ఉద్యోగ భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఎస్ఏఐలో రెండోసారి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని పేర్కొంది.