అందరికీ క్రీడలు... అదే నా కల: సచిన్
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలనేదే తన కలని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. క్రీడలనేవి పోటీలకే అనే ఉద్దేశంతో ప్రజలున్నారని... సరదాతో పాటు ఒంట్లోని కేలరీలను కరిగించేందుకు ఇవి ఉపయోగపడతాయని గుర్తించడం లేదని సచిన్ తెలిపారు. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన ‘లింకెడిన్’లో చేరిన అనంతరం సచిన్ తన ఆలోచనలను పంచుకున్నారు. ‘అందరికీ క్రీడలు అదే నా లక్ష్యం. ఆసక్తి వున్న క్రీడను రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి.
ఫిట్‌నెస్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అని అన్నారు. తన సుదీర్ఘ పయనంపై సచిన్ ఇలా వివరించారు... ‘బ్యాగ్ సర్దుకోవడంనుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. బట్టల ఇస్త్రీ నుంచి అన్ని పనులు నేనే సొంతంగా చేసుకునేవాణ్ని. ఆ తర్వాత అదే అలవాటుగా మారిపోయింది అని అన్నారు. ఇప్పుడు కెరీర్ ముగిశాక కూడా తీరిక లేకుండా గడుపుతున్నానని చెప్పారు. ‘నవతరం టెక్నాలజీపై దృష్టిపెట్టాను. ఆరోగ్యం, ఫిట్‌నెస్, లైఫ్‌స్టయిల్, క్లాతింగ్ ఇలా అభిరుచి ఉన్న రంగాల్లో ప్రవేశించాను. ఇందులో నా ఆలోచనల్ని పంచుకుని అవసరమైన వాటి తయారీలో భాగస్వామినవుతున్నాను’ అని చెప్పారు.