న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ అనంతరం దొరికిన కొద్దిపాటి విరామంతో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది.
అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. ఆపై జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. దాంతో వన్డే సిరీస్ ను గెలిచిన ఉత్సాహంతో విరాట్ సేన బరిలోకి దిగుతుండగా, కనీసం టీ 20 సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది. అయితే మూడు వన్డేల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియాకు టీ 20 సిరీస్ ల్లో కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. దాంతో టీమిండియాతో జరిగే టీ 20ల్లో బోణి కొట్టాలంటే మాత్రం న్యూజిలాండ్ సమష్టిగా రాణించాల్సి ఉంది.
ఈ ఏడాది భారత జట్టు ఇప్పటివరకూ స్వదేశంలో ఆడిన టీ 20 సిరీస్ లు రెండు. జనవరిలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు టీ 20ల సిరీస్ ఒకటైతై, ఇటీవల ఆసీస్ జరిగిన మూడు టీ 20ల సిరీస్ మాత్రమే స్వదేశంలో విరాట్ సేన ఆడింది. ఈ రెండు సిరీస్ ల్లోనూ భారత్ కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇంగ్లండ్ తో సిరీస్ ను 2-1 తో గెలిచిన విరాట్ సేన.. ఆసీస్ తో జరిగిన సిరీస్ ను 1-1తో సమం చేసుకుంది. ఆ క్రమంలో భారత్ కు న్యూజిలాండ్ సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు.
ఇప్పటివరకూ ఈ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ 20లు నాలుగు మాత్రమే . గతేడాది టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్ జరిగింది. ఆ వరల్డ్ కప్ లో మూడు గ్రూప్ మ్యాచ్ లతో పాటు ఒక సెమీస్ ఫైనల్ మ్యాచ్ కు ఫిరోజ్ కోట్ల ఆతిథ్యమిచ్చింది. కాగా, రేపు న్యూజిలాండ్ తో జరిగి టీ 20నే భారత్ కు మొదటి టీ 20 కావడం విశేషం. స్లో ట్రాక్ గా పేరున్న ఫిరోజ్ షాలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారీ స్కోరుకు అవకాశం ఉండకపోవచ్చు.
ఖాతా తెరుస్తారా?
న్యూజిలాండ్ తో ఇప్పటివరకూ జరిగిన అన్ని టీ 20 మ్యాచ్ ల్లోనూ భారత్ కు నిరాశే ఎదురైంది. 2007 నుంచి చూస్తే కివీస్ తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. వరల్డ్ టీ 20 ల్లో భాగంగా గతేడాది న్యూజిలాండ్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో సైతం టీమిండియా పరాజయం చెందింది. దాంతో భారత్ పై కివీస్ కు తిరుగులేని టీ 20 రికార్డు ఉందనే విషయం అర్ధమవుతోంది. దాంతో పొట్టిఫార్మాట్ లో కివీస్ పై ఖాతా తెరిచి ఆ చెత్త రికార్డుకు చెరమగీతం పాడాలని విరాట్ సేన యోచిస్తోంది. మరొకవైపు తమ రికార్డును కొనసాగించేందకు కివీస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.
ఆశిష్ నెహ్రాకు చోటు!
న్యూజిలాండ్ తో జరిగే తొలి టీ 20 మ్యాచ్ భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు చివరి మ్యాచ్ కావడంతో అతనికి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. నెహ్రాకు ఘనంగా వీడ్కోలు ఇచ్చే క్రమంలో అతనికి తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఆసీస్ తో టీ 20 సిరీస్ లో ఎంపికైన నెహ్రాకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఒకసారి జట్టులో ఎంపికైన తరువాత అలా రిజర్వ్ బెంచ్ లో కూర్చోవడం నెహ్రా కెరీర్ లో అదే తొలిసారి. దాంతో తన కెరీర్ కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని భావించిన నెహ్రా.. తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లలో న్యూజిలాండ్ తో జరిగే టీ 20 మ్యాచ్ లో వీడ్కోలు చెప్పనున్నట్లు అప్పుడే ప్రకటించాడు. దాంతో భారత జట్టుకు విశేష సేవలందించిన నెహ్రాను గౌరవంగా సాగనంపాలనే ఉద్దేశంతో క్రికెట్ బోర్డు ఉన్నట్లు సమాచారం.
తుది జట్లు అంచనా
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ఆశిష్ నెహ్రా
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, రాస్ టేలర్, గప్టిల్, రాస్ టేలర్, గ్రాండ్ హోమ్, నికోలస్, మిల్నే, మున్రో, సాంత్నార్, టిమ్ సౌథీ
Comments
Please login to add a commentAdd a comment