ప్లే ఆఫ్కు హైదరాబాద్
మొహాలీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో అంచనాలు మించి రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంది. ఈ తాజా విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
కింగ్స్ పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52;41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్), శిఖర్ ధవన్ (25;22 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం దీపక్ హూడా(34; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ 16.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆపై యువరాజ్ సింగ్(42 నాటౌట్;24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాటు, కట్టింగ్(21నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందివ్వడంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరచగా, హషీమ్ ఆమ్లా(96;56 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సాహా(27), గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు.