లంక వీరంగం | Sri Lanka beat England by 20 runs | Sakshi
Sakshi News home page

లంక వీరంగం

Published Sat, Jun 22 2019 5:12 AM | Last Updated on Sat, Jun 22 2019 5:56 AM

Sri Lanka beat England by 20 runs - Sakshi

మాథ్యూస్, స్టోక్స్‌

శ్రీలంక సీనియర్‌ ఆటగాళ్లు మాథ్యూస్, మలింగ. ఒకరు బ్యాట్‌తో, మరొకరు బంతితో హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ టోర్నీలో డకౌట్లతో తీవ్ర విమర్శలెదుర్కొన్న మాథ్యూస్‌ అజేయ పోరాటంతో జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. తర్వాత మలింగ తన అనుభవాన్నంత రంగరించి ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో లంక ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.  

లీడ్స్‌: ‘ఈ ప్రపంచకప్‌లో మేమూ ఆడుతున్నాం... మావైపూ కన్నెత్తి చూడండి’ అనే రీతిలో విజయం సాధించింది శ్రీలంక. శుక్రవారం జరిగిన పోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌కు అనూహ్య షాకిస్తూ 20 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (115 బంతుల్లో 85 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కని పోరాటం చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్, మార్క్‌ వుడ్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 47 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టోక్స్‌ (89 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. రూట్‌ (89 బంతుల్లో 57; 3 ఫోర్లు) రాణించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మలింగ (4/43) ఇంగ్లండ్‌ను వణికించాడు. స్పిన్నర్‌ ధనంజయ 3 వికెట్లు తీశాడు.

ఆదుకున్న మాథ్యూస్‌...
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆదిలోనే ఓపెనర్లు కరుణరత్నే (1), కుశాల్‌ పెరీరా (2) వికెట్లను కోల్పోయింది. అప్పుడు జట్టు స్కోరు 2/3. ఈ దశలో అవిష్క ఫెర్నాండో (39 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (68 బంతుల్లో 46; 2 ఫోర్లు) ఆదుకున్నారు. ఫెర్నాండో ఔటయ్యాక వచ్చిన మాథ్యూస్‌ అద్భుతమైన పోరాటం చేశాడు. నాలుగో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌తో కలిసి 71 పరుగులు జోడించిన మాథ్యూస్‌... ధనంజయ (29)తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జతచేశాడు. జీవన్‌ (0) డకౌట్‌ కాగా, టెయిలెండర్లతో కలిసి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.  

మలింగ కూల్చేశాడు...
ఇటీవల 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్‌కు 233 పరుగుల లక్ష్యం ఏమంత కష్టమే కాదు. కానీ పిచ్‌ పరిస్థితులతో పాటు మలింగ వీరంగం ముందు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ తోకముడిచారు. అతని తొలి ఓవర్లోనే బెయిర్‌స్టో (0) డకౌటయ్యాడు. కాసేపటికి విన్స్‌ (18 బంతుల్లో 14; 2 ఫోర్లు) ఆటా ముగించాడు. ఈ దశలో రూట్, కెప్టెన్‌ మోర్గాన్‌ (35 బంతుల్లో 21; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు కష్టపడ్డారు. కానీ మలింగ ఆ అవకాశం ఇవ్వలేదు. జట్టు స్కోరు 73 పరుగుల వద్ద మోర్గాన్‌ను ఉదాన ఔట్‌చేస్తే... అర్ధసెంచరీ పూర్తి చేసిన రూట్, కీలకమైన బట్లర్‌ (9 బంతుల్లో 10; ఫోర్‌) వికెట్లను మలింగ పడేశాడు. 144 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ధనంజయ డిసిల్వా (3/32) లోయర్‌ ఆర్డర్‌ పనిపట్టడంతో ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది. 186 స్కోరు వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోవడంతో స్టోక్స్‌ వరుసగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ వుడ్‌ (0)ను నువాన్‌ ప్రదీప్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌పై లంక విజయఢంకా మోగించింది.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1; కుశాల్‌ పెరీరా (సి) అలీ (బి) వోక్స్‌ 2; ఫెర్నాండో (సి) రషీద్‌ (బి) వుడ్‌ 49; కుశాల్‌ మెండిస్‌ (సి) మోర్గాన్‌ (బి) రషీద్‌ 46; మాథ్యూస్‌ (నాటౌట్‌) 85; జీవన్‌ మెండిస్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 0; ధనంజయ డిసిల్వా (సి) రూట్‌ (బి) ఆర్చర్‌ 29; తిసారా పెరీరా (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 2; ఉదాన (సి) రూట్‌ (బి) వుడ్‌ 6; మలింగ (బి) వుడ్‌ 1; ప్రదీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 232. 

వికెట్ల పతనం: 1–3, 2–3, 3–62, 4–133, 5–133, 6–190, 7–200, 8–209, 9–220.

బౌలింగ్‌: వోక్స్‌ 5–0–22–1, ఆర్చర్‌ 10–2–52–3, వుడ్‌ 8–0–40–3, స్టోక్స్‌ 5–0–16–0, మొయిన్‌ అలీ 10–0–40–0, రషీద్‌ 10–0–45–2, రూట్‌ 2–0–13–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: విన్స్‌ (సి) కుశాల్‌ మెండిస్‌ (బి) మలింగ 14; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) మలింగ 0; రూట్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) మలింగ 57; మోర్గాన్‌ (సి అండ్‌ బి) ఉదాన 21; స్టోక్స్‌ (నాటౌట్‌) 82; బట్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మలింగ 10; మొయిన్‌ అలీ (సి) ఉదాన (బి) ధనంజయ డిసిల్వా 16; వోక్స్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ధనంజయ డిసిల్వా 2; రషీద్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ధనంజయ 1; ఆర్చర్‌ (సి) తిసారా పెరీరా (బి) ఉదాన 3; వుడ్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ప్రదీప్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్‌) 212.

వికెట్ల పతనం: 1–1, 2–26, 3–73, 4–127, 5–144, 6–170, 7–176, 8–178, 9–186, 10–212.

బౌలింగ్‌: మలింగ 10–1–43–4, ప్రదీప్‌ 10–1–38–1, ధనంజయ డిసిల్వా 8–0–32–3, తిసారా పెరీరా 8–0–34–0, ఉదాన 8–0–41–2, జీవన్‌ 3–0–23–0. 


మాథ్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement