కరుణరత్నె
లీడ్స్: సెమీస్ రేసులో నిలవాలంటే ఆడబోయే నాలుగు మ్యాచ్‌లూ గెలవాల్సిన పరిస్థితుల్లో మాజీ చాంపియన్ శ్రీలంక శుక్రవారం టోర్నీ ఫేవరెట్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ద్వారా నాలుగు పాయింట్లతో (ఒక గెలుపు, రెండు రద్దు, రెండు ఓటములు) ఉన్న లంకకు... జోరుమీదున్న ఆతిథ్య జట్టును నిలువరించడం శక్తికి మించిన పనే కానుంది. కరుణరత్నె బృందం మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యాలతో పరాజయ బాటలో ఉండగా, అందుకు పూర్తి భిన్నంగా మోర్గాన్ సేన భీకర హిట్టింగ్‌తో దుమ్ము రేపుతోంది.
కండరాల గాయంతో ఓపెనర్ జేసన్ రాయ్ దూరమైనా, బెయిర్‌స్టో సరైన సమయంలో జోరందుకుని ఇంగ్లండ్‌కు బెంగ లేకుండా చేశాడు. రూట్ నిలకడకు తోడు తానెంత విధ్వంసకరంగా ఆడగలడో గత మ్యాచ్‌లో కెప్టెన్ మోర్గాన్ చాటాడు. వీరికి ప్రత్యర్థి పేసర్లు లసిత్ మలింగ, నువాన్ ప్రదీప్ ఏ మేరకు కళ్లెం వేయగలరో చూడాలి. ఓపెనర్లు కెప్టెన్ కరుణ రత్నె, కుశాల్ పెరీరా మినహా మిగతా వారు పరుగులు చేయలేకపోతుండటం లంక ఓటములకు ప్రధానం కారణం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 205/3 నుంచి 247కు ఆలౌటైన తీరే దీనికి నిదర్శనం. కుశాల్ మెండిస్, మాథ్యూస్, తిసారా పెరీరా పూర్తిగా విఫలమవుతున్నారు. ఈ త్రయం రాణిస్తే జట్టు ఇంగ్లండ్‌పై పోరాడగలదు. ఫామ్‌లో ఉన్న పేసర్లు ఆర్చర్, వుడ్‌లను తట్టుకుని వీరు క్రీజులో నిలవడం అనుమానమే.
ముఖాముఖి రికార్డు
ప్రస్తుత బలాబలాలు ఎలా ఉన్నా మొత్తం వన్డే గెలుపోటముల గణాంకాల్లో ఇంగ్లండ్‌కు శ్రీలంక దీటుగా నిలుస్తోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌లకుగాను నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment