
భారత్ ఇంకా ‘పరుగు’ మొదలు పెట్టలేదు. ధావన్ డకౌట్! పర్లేదు... మరో ఓపెనర్ రోహిత్ ఉన్నాడు. జట్టు స్కోరు 2. అప్పుడే అతనూ (2) అవుట్! దీనికే బెంబేలెందుకు... మిడిలార్డర్ ఉందిగా. టీమ్ స్కోరు సంఖ్యగా మారలేదు. అంకె (8)లోనే ఉండగా మరో వికెట్ దినేశ్ కార్తీక్ డకౌట్! అయితే మాత్రం... ధోనికి ముందు పాండే, ఆ వెనక పాండ్యా ఉన్నారుగా. హతవిధి... పాండే (2), శ్రేయస్ (9) అవుట్! సగం వికెట్లు 16 పరుగులకే ఫటాఫట్!! ఇక పర్లేదంటే కుదరదు. జాగ్రత్తగా ఆడాలనుకుంటుండగానే పాండ్యా (10), భువనేశ్వర్ (0) ఖేల్‌ఖతం. భారత్ 29/7. కనీసం జాగ్రత్త పడే అవకాశం కూడా ఇవ్వలేదు లంక బౌలర్లు. ధోని అర్ధసెంచరీ పుణ్యామాని స్కోరు వంద పరుగులు దాటింది. లేదంటే లంక బౌలర్ల ధాటికి మరో అత్యల్ప స్కోరు ఖాయమయ్యేది. ఇంత చెత్తగా, చిత్రంగా ఆడినా... చిత్తుగా ఓడినా... చరిత్రలో మరో చెత్త స్కోరు నుంచి బయటపడటమే ఈ మ్యాచ్‌లో భారత్‌కు దక్కిన ఊరట!
ధర్మశాల: రోహిత్ శర్మ కొత్త కెప్టెనే అయినా... సారథిగా చాలా అనుభవముంది. ఐపీఎల్‌లో విజయవంతమైన నాయకుడనే పేరుంది. టీమ్ ఫామ్‌లో ఉంది. వన్డేల్లోనూ నంబర్‌వన్ దిశగా ఆడుగులేస్తోంది. లంకను వారి సొంతగడ్డపైనా వణికించింది. ఇప్పుడు ఇక్కడా టెస్టుల్లో ఓడించింది. కానీ ధర్మశాలలో ఇదేం ఆట. అదేం స్కోరు. ఒక దశలో భారత్ స్కోరు (29/7) చూస్తే చిత్తు స్కోరుకు, చెత్త ఆటకు చిరునామా అయ్యేదనిపించింది. ధోని (87 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటంతో పరువు నిలబెట్టుకుంది. కానీ మొత్తానికి ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడింది. మూడు వన్డేల సిరీస్‌ను పరాభవంతో ప్రారంభించింది. ఈ టోర్నీలో 0–1తో వెనుకబడింది. రెండో వన్డే 13న మొహాలీలో జరగనుంది.
‘సింహళ సీమర్లు’ సురంగ లక్మల్ (4/13), నువాన్ ప్రదీప్ (2/37), మాథ్యూస్ (1/8), పెరీరా (1/29) ఒక్కసారిగా గర్జించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ మీద దెబ్బ తీశారు. తేరుకునేలోపే తేలిగ్గా ఆలౌట్ చేశారు. లంక సింహనాదానికి ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. మొత్తం జట్టులో ధోనితో పాటు కుల్దీప్ యాదవ్ (19; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (10; 2 ఫోర్లు)లవే రెండంకెల స్కోర్లు. మిగతా వారివి సింగిల్ డిజిట్లే. ఇందులో నలుగురువి డకౌట్లు. అనంతరం శ్రీలంక 20.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 114 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ తరంగ (46 బంతుల్లో 49; 10 ఫోర్లు) రాణించగా, మాథ్యూస్ (42 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు), డిక్‌వెలా (24 బంతుల్లో 26 నాటౌట్; 5 ఫోర్లు) అజేయంగా నిలిచారు. శ్రీలంక సీమర్ లక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
అసలు ఇది నెం.1 అడుగేనా...
టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... వన్డేల్లోనూ నంబర్‌వన్ కోసం ఈ సిరీస్‌లో అడుగు వేసింది. కానీ పడరాని పాట్లతో ఆశ్చర్యకర ఆటతీరుతో ఈ మ్యాచ్‌లో ఓడింది. తొలుత టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ జట్టు పరుగుల ఖాతా తెరువకుండానే ధావన్ (0), 2 పరుగుల వద్ద రోహిత్ (2) అవుటయ్యారు. తొలుత ధావన్ ఎల్బీ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించగా... బౌలర్ మాథ్యూస్ డీఆర్‌ఎస్ ద్వారా ఫలితం రాబట్టాడు. లక్మల్ అద్భుతమైన బంతికి రోహిత్... డిక్‌వెలాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
లక్మల్ 10–4–13–4
ఏకధాటిగా వేసిన 10 ఓవర్ల స్పెల్‌తో లక్మల్ భారత్‌ను అదే పనిగా కుంగదీశాడు. దినేశ్ కార్తీక్ (0)ను, మనీశ్ పాండే (2)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో 16 పరుగులకే సగం జట్టు నిష్క్రమించింది. ధోనిని నిలబెట్టి అవతలివైపు నుంచి వికెట్ల పనిపట్టారు. దీంతో హార్డిక్ పాండ్యా (10), భువనేశ్వర్ (0)ల ఆట కూడా ముగిసింది. పాండ్యాను ప్రదీప్, భువీని లక్మల్ అవుట్ చేశారు. భారత్ స్కోరు 29/7. పీకల్లోతు కష్టం కాదు... కొలమానమే లేని కష్టాల్లో టీమిండియా. ఈ దశలో ధోని నిలబడ్డాడు. కుల్దీప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను వందదాకా నడిపించాడు. 112 స్కోరు వద్ద ధోని వికెట్ తీసిన పెరీరా భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
రాణించిన తరంగ
కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక కూడా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద గుణతిలక (1)ను బుమ్రా అవుట్ చేయగా... తిరిమన్నె (0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు. 19 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. అప్పటికి పరుగు మాత్రమే చేసిన తరంగ బుమ్రా బౌలింగ్‌లో అవుటై నిష్క్రమించే పనిలో పడ్డాడు. అతని క్యాచ్‌ను గల్లీలో దినేశ్ కార్తీక్ చక్కగా అందుకున్నప్పటికీ బంతి ‘నోబాల్’ అయింది. దీంతో బతికి పోయిన తరంగ ఆ తర్వాత యథేచ్చగా ఆడుకున్నాడు. మాథ్యూస్‌తో మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాక తన అర్ధసెంచరీకి పరుగు దూరంలో పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత మాథ్యూస్‌కు జతయిన డిక్‌వెలా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు.
తెలిసిందా ధోని విలువేంటో...
ఇపుడంటే కోహ్లి పెళ్లి మాయలో పడి ధోని ఊసెత్తడం లేదు కానీ... ఈ మధ్య కాలంలో అదేపనిగా విమర్శకులు ధోనిపై నిర్ణయం తీసుకోవాలని సెలక్టర్లకు, వైదొలగాలని ఈ మాజీ చాంపియన్ కెప్టెన్‌కు ఉచిత సలహాలిచ్చారు. ఇలాంటి విమర్శలెదురైనపుడల్లా కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మాజీ సారథికి అండగా నిలిచారు. అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉందని, జట్టును గెలిపించే ఆటగాడని కితాబిస్తూ వచ్చారు. ఆదివారం కూడా అదే జరిగింది... కానీ ‘గెలిపించే’ది సాధ్యపడకపోయినా... క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని ధోని తొలివన్డేలో తన బ్యాట్‌తో నిరూపించాడు. అతనే గనక కుల్దీప్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించకపోయి వుంటే షార్జా చెత్త రికార్డు చెరిగి కొత్త చెత్త రికార్డు వచ్చేది. 2000 సంవత్సరంలో షార్జాలో లంక చేతిలో భారత్ 54 పరుగులకే ఆలౌటైంది. సచిన్, గంగూలీ, యువరాజ్ వంటి హేమా హేమీలున్న జట్టే అత్యల్ప స్కోరుకు తలవంచింది. ఇప్పుడు ధోని ఉండటంతో ఆ ప్రమాదం తప్పింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) డిక్‌వెలా (బి) లక్మల్ 2; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) మాథ్యూస్ 0; శ్రేయస్ (బి) ప్రదీప్ 9; దినేశ్ కార్తీక్ ఎల్బీడబ్ల్యూ (బి) లక్మల్ 0; మనీశ్ పాండే (సి) మాథ్యూస్ (బి) లక్మల్ 2; ధోని (సి) గుణతిలక (బి) పెరీరా 65; హార్దిక్ పాండ్యా (సి) మాథ్యూస్ (బి) ప్రదీప్ 10; భువనేశ్వర్ (సి) డిక్‌వెలా (బి) లక్మల్ 0; కుల్దీప్ (స్టంప్డ్) డిక్‌వెలా (బి) ధనంజయ 19; బుమ్రా (బి) పతిరన 0; చహల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.2 ఓవర్లలో ఆలౌట్) 112.
వికెట్ల పతనం: 1–0, 2–2, 3–8, 4–16, 5–16, 6–28, 7–29, 8–70, 9–87, 10–112.
బౌలింగ్: లక్మల్ 10–4–13–4, మాథ్యూస్ 5–2–8–1, ప్రదీప్ 10–4–37–2, తిసారా పెరీరా 4.2–0–29–1, అకిల ధనంజయ 5–2–7–1, సచిత్ పతిరన 4–1–16–1.
శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) బుమ్రా 1; తరంగ (సి) ధావన్ (బి) హార్దిక్ పాండ్యా 49; తిరిమన్నె (బి) భువనేశ్వర్ 0; మాథ్యూస్ నాటౌట్ 25; డిక్‌వెలా నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20.4 ఓవర్లలో 3 వికెట్లకు) 114.
వికెట్ల పతనం: 1–7, 2–19, 3–65.
బౌలింగ్: భువనేశ్వర్ 8.4–1–42–1, బుమ్రా 7–1–32–1, హార్దిక్ పాండ్యా 5–0–39–1.
► ఈ మ్యాచ్ ద్వారా ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్‌లో బరిలోకి దిగిన 219వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. మాజీ కెప్టెన్ ధోని చేతుల మీదుగా శ్రేయస్ టోపీని అందుకున్నాడు.
► స్వదేశంలో తొలుత బ్యాటింగ్‌కు దిగాక భారత్ చేసిన అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా సొంతగడ్డపై భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. 1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 78 పరుగులకు ఆలౌటైంది.
► భారత్‌పై ఓ జట్టు 13 మెయిడిన్ ఓవర్లు వేయడం ఇదే తొలిసారి. వన్డేల్లో భారత జట్టు 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. గతంలో జింబాబ్వేపై 1983 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 17 పరుగులకు ఐదు వికెట్లు చేజార్చుకుంది.
► ఆరేళ్ల తర్వాత భారత్ ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాట్స్‌మన్ ఖాతా తెరవకుండా అవుటయ్యారు. గతంలో ఏకైకసారి 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నలుగురు భారత ఆటగాళ్లు డకౌటయ్యారు.
భారత్ తరఫున వన్డేల్లో గరిష్టంగా 18 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్. గతంలో ఈ రికార్డు ఏక్‌నాథ్ సోల్కర్ (17 బంతులు–1974లో ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది.
పేస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రహానేను తప్పించడం తప్పే. టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పర్‌ఫెక్ట్ ఓపెనర్‌గా చూసింది. అందువల్లే మిడిలార్డర్‌లో ఆడించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో మేం మరో 70–80 పరుగులు చేయాల్సింది. చెత్త బ్యాటింగ్ వల్లే ఓడాం. ఓ విధంగా మా అందరికీ ఇది కనువిప్పు. ధోని ఆట నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థుడు ధోని. ఈ మ్యాచ్‌లో లంక పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment