
దిగ్గజ ఆటగాళ్లకే అది సాధ్యం కాలేదు..!
► 17 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై విజయం
► 106 పరుగులతో కంగారూలు చిత్తు
పల్లెకెలె: స్ఫూర్తిదాయక ఆటతీరుతో శ్రీలంక జట్టు టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాపై నెగ్గి తమ టెస్టు చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం పల్లెకెలెలో ముగిసిన తొలి టెస్టులో లంక 106 పరుగుల తేడాతో పటిష్ట ఆసీస్ ను చిత్తు చేసింది. ఇరు జట్లు తమ ప్రత్యర్థులను రెండు పర్యాయాలు ఆలౌట్ చేశాయి. ఆసీస్, లంక బౌలర్లు మెరుగ్గా రాణించారు. అయితే ఇరుజట్లలో ప్రధాన వ్యత్యాసం ఏదైనా ఉందంటే అది లంక యువ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్. ఈ టెస్టులో నమోదైన ఏకైన సెంచరీ అతడి బ్యాట్ నుంచి వచ్చింది. లంక దిగ్గజ ఆటగాళ్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, దిల్షాన్, ముత్తయ్య మురళీదరణ్ లకు సాధ్యంకానిది కుశాల్ ఇన్నింగ్స్ నెరవేర్చింది.
తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 117 పరుగులకే ఆలౌటైన లంక, రెండో ఇన్నింగ్స్ లోనూ కష్టాల్లో ఉన్న దశలో కుశాల్ అద్భుత ఇన్నింగ్స్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్) జట్టును కోలుకునేలా చేయడమే కాదు చారిత్రక విజయానికి నాంది పలికింది. కుశాల్ ఇన్నింగ్స్ ఇచ్చిన స్ఫూర్తితో లంక బౌలర్లు ఆసీస్ను రెండో ఇన్నింగ్స్ లో ఒత్తిడిలో నెట్టి సక్సెస్ సాధించారు. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌట్ కావడంతో 17 ఏళ్ల తర్వాత లంక ఓ విజయాన్ని నమోదు చేసింది.
లంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (5/54), లక్షణ్ సందకన్ (3/49) చివరి సెషన్లో కీలకపాత్ర పోషించడం కూడా కలిసొచ్చింది. చివరి సారిగా ఆసీస్‌ను 1999లో ఓడించిన లంక మొత్తంగా కంగారూలతో 27 టెస్టులాడగా అందులో 17 ఓడిన లంకేయులు, 8 మ్యాచ్ లను డ్రా చేసుకున్నారు. తొలి సెంచరీతోనే అతిపిన్న వయసులో టెస్టు శతకం బాదిన రికార్డు నమోదు చేసిన కుశాల్, జట్టు విజయానికి తోడ్పడిన కీలక ఇన్నింగ్స్ కు గానూ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.