కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ‘డ్రా’ చేసుకున్న శ్రీలంక జట్టు... వన్డే సిరీస్‌ను కూడా ‘డ్రా’గా ముగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ గెలుపొందగా... వర్షం కారణంగా రెండో మ్యాచ్ రద్దయింది. బ్యాట్స్‌మన్, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 70 పరుగుల తేడాతో గెలిచి 1–1తో సిరీస్‌ను పంచుకుంది. తొలుత శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది.
కుషాల్ మెండిస్ (54; 4 ఫోర్లు), తిసార పెరీరా (52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మోర్తజా 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లంక బౌలర్ కులశేఖర (4/37) చెలరేగడంతో బంగ్లాదేశ్ జట్టు 44.3 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. షకీబుల్ హసన్ (54; 7 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (51; 6 ఫోర్లు) పోరాడారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, దిల్‌రువాన్ పెరీరా, ప్రసన్న తలా 2 వికెట్లు పడగొట్టారు.