క్రికెట్ కు సంగక్కర గుడ్ బై
కొలంబో: దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుబ్ బై చెప్పిన శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కర తాజాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్కు సైతం వీడ్కోలు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా సెప్టెంబర్ లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు సంగాక్కర తాజాగా ప్రకటించాడు. ' మరికొన్ని నెలల్లో 40వ ఒడిలోకి వెళ్లబోతున్నా. ఇంకా ఆడాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. దాంతో ఇక పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇంగ్లండ్ లో ఆడబోయే కౌంటీ క్రికెట్ నాకు చివరిది. కొన్ని రోజుల్లో నా క్రికెట్ కెరీర్ ముగుస్తుంది. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదొక రోజు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదు'అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంగా స్పష్టం చేశాడు.
2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో కౌంటీల్లో వెయ్యి పరుగులు సాధించిన సంగా.. మిడిల్సెక్స్ పై రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు.