
జయాంగని 178 సరిపోలేదు!
♦ లంకపై ఆసీస్‌దే పైచేయి
♦ నింగ్ 152 నాటౌట్
124 : బౌండరీల ద్వారానే చమరి సాధించిన పరుగులు
శ్రీలంక బ్యాట్స్‌మన్ చమరి అటపట్టు జయాంగని అద్భుతమైన బ్యాటింగ్, రికార్డుల హోరు శ్రీలంకను గెలిపించలేకపోయింది. అటు వైపు పోటీగా శతకం బాదిన ఆసీస్ కెప్టెన్ లానింగ్ తమ జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించింది.
బ్రిస్టల్: భారీ సెంచరీలతో హోరెత్తిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను కంగుతినిపించింది. మొదట శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది. చమరి జయాంగని (143 బంతుల్లో 178 నాటౌట్; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది. ఆమె తర్వాత సిరివర్ధనే (24) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలైస్ పెర్రీ, క్రిస్టెన్ బీమ్స్, నికోల్ బోల్టన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
తర్వాత ఆస్ట్రేలియా 43.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (135 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్) కూడా లంక బౌలర్లపై చెలరేగింది. ఓపెనర్ నికోల్ బోల్టన్ (71 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... రెండో వికెట్‌కు వీరిద్దరు 133 పరుగులు జోడించారు. తర్వాత లానింగ్, పెర్రీ అబేధ్యమైన మూడో వికెట్‌కు 124 పరుగులు జతచేయడంతో విజ యం సులువైంది. ఈ టోర్నీలో ఆసీస్‌కిది రెండో విజయం. లంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.