వాళ్లకెందుకు ఇష్టం లేదు ? | Sri Lanka's Preparations for India Tour Not Great | Sakshi
Sakshi News home page

వాళ్లకెందుకు ఇష్టం లేదు ?

Published Tue, Oct 28 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

వాళ్లకెందుకు ఇష్టం లేదు ?

వాళ్లకెందుకు ఇష్టం లేదు ?

భారత్‌తో వన్డే సిరీస్‌పై శ్రీలంక సీనియర్ క్రికెటర్ల అసంతృప్తి
 
 వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కొన్ని గంటలకే బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఖరారు చేసింది. ఈ రెండు బోర్డుల మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా లంక బోర్డు కూడా వెంటనే ఒప్పుకుంది. కానీ శ్రీలంక సీనియర్ క్రికెటర్లు మాత్రం ఈ పర్యటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 

 సాక్షి క్రీడా విభాగం
 శ్రీలంక జట్టు భారత్‌లో ఇప్పుడు వన్డేలు ఆడటం వల్ల ఇటు బీసీసీఐకి అటు లంక బోర్డుకు కూడా లాభమే. ఇప్పుడు సిరీస్ ఆడినందుకు ప్రతిఫలంగా వచ్చే ఏడాది ఆ దేశంలో టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న లంక బోర్డుకు భారత్‌తో సిరీస్‌ను నిర్వహిస్తే చాలా లాభం. ఇటు వెస్టిండీస్ వెళ్లిపోయినందున... శ్రీలంక ఐదు వన్డేలు ఆడటం వల్ల ప్రసారదారులకు ఒప్పందం ప్రకారం మ్యాచ్‌లు ఇచ్చే అవకాశం బీసీసీఐకి దక్కింది. అయితే ఈ సిరీస్ ఖరారయ్యే సమయానికి కండిషనింగ్ క్యాంప్‌లో ఉన్న శ్రీలంక క్రికెటర్లకు మాత్రం ఇది నచ్చలేదు.

 స్వదేశంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో ఆడిన సిరీస్‌లలో శ్రీలంక ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంది. అదే సమయంలో చాలామంది క్రికెటర్లు చిన్న చిన్న గాయాలతో బాధపడుతున్నారు. ప్రపంచకప్‌కు సమాయత్తం కావడం కోసం శ్రీలంక కొత్త కోచ్ ఆటపట్టు ఒక ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆరువారాల పాటు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ మీద క్యాంపులో ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. భారత్‌తో సిరీస్ కోసం ఈ శిబిరాన్ని అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వస్తోంది. ‘ఒక నెల రోజుల పాటు చేయాల్సిన పనిని ఇప్పుడు వారం రోజుల్లోనే చేయాల్సి వస్తోంది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మా సన్నాహాలకు ఇది విఘాతం కలిగిస్తోంది. మా బోర్డు ఆటగాళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా భారత్‌తో సిరీస్‌ను ఒప్పుకుంది’ అంటూ సీనియర్ ఆటగాడు సంగక్కర బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
 
 ప్రపంచకప్‌కు ముందు 19 వన్డేలు
 శ్రీలంక జట్టు ప్రపంచకప్ కోసం మంచి షెడ్యూల్‌నే రూపొందించుకుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు వన్డేలు ఆడనుంది. అలాగే ప్రపంచకప్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన న్యూజిలాండ్ వెళ్లి మరో ఏడు వన్డేలు ఆడుతుంది. ఈ 14 వన్డేలతో తాము పూర్తిస్థాయిలో సిద్ధం అవుతామని భావించారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఐదు వన్డేలువచ్చాయి. దీంతో మొత్తం 19 వన్డేలు అయ్యాయి.

‘ప్రపంచకప్‌కు ముందు 14 వన్డేలు ఆడటమే చాలా ఇబ్బంది. ఇక 19 వన్డేలు ఆడితే పూర్తిగా అలసిపోతారు. ఈ సిరీస్ లేకపోతేనే బాగుండేది’ అని మరో సీనియర్ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత్‌తో శ్రీలంక రికార్డు చాలా పేలవంగా ఉంది. మళ్లీ ఇప్పుడు సన్నాహాలు సరిగా లేకుండా ఆడటం ఇబ్బందే అనేది కెప్టెన్ మాథ్యూస్ అభిప్రాయం. ‘ఇంత తక్కువ సమయంలో భారత్‌లాంటి జట్టుతో సిరీస్ ఆడటం చాలా కష్టం’ అని మాథ్యూస్ అన్నాడు.

 పూర్తి జట్టు రావాల్సిందే!
 అయితే ఈ సిరీస్ కోసం కొంతమంది సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాలనే సూచన ఆటగాళ్ల నుంచి వచ్చింది. కానీ దీనికి లంక బోర్డు ఒప్పుకోలేదు. ‘దిల్షాన్, సంగక్కర, జయవర్ధనే ముగ్గురూ ప్రపంచకప్‌కు చాలా కీలకం. ఆ పర్యటన సమయానికి వీళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలి. కాబట్టి వీళ్లకు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది’ అని ఓ సెలక్టర్ సూచించారు.

కానీ ఈ ముగ్గురూ లేకుండా భారత్‌కు జట్టును పంపితే అది ద్వితీయ శ్రేణి జట్టే అవుతుంది. స్పాన్సర్లకు ఆసక్తి ఉండదు. కాబట్టి బీసీసీఐ దీనికి అంగీకరించదు. దీనిని దృష్టిలో ఉంచుకుని లంక క్రికెట్ బోర్డు పూర్తి స్థాయిలో సీనియర్ జట్టునే పంపిస్తోంది. మలింగ గాయం కారణంగా అందుబాటులో లేడు. హెరాత్‌కు మాత్రం విశ్రాంతి ఇచ్చారు. అయితే సీనియర్లకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఏడు వన్డేల సిరీస్‌లో అవసరమనుకుంటే విశ్రాంతి ఇస్తామని లంక బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీనియర్లు కాస్త మెత్తబడ్డారు.

 స్నేహం కొనసాగాలి
 ఆటగాళ్లలో అసంతృప్తి ఉన్నా భారత్‌తో మంచి సంబంధాలు ఉండాలని శ్రీలంక బోర్డు కోరుకుంటోంది. ఇందులో తప్పేంలేదు. వాళ్లకు ఉన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా... బీసీసీఐతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంచిది. ‘1996 ప్రపంచకప్‌కు ముందు కొన్ని దేశాలు శ్రీలంకలో క్రికెట్ ఆడేందుకు రాలేదు. ఆ సమయంలో భారత్ తమ క్రికెటర్లను ఇక్కడికి పంపించి ఆడించింది. కాబట్టి వెస్టిండీస్ వెళ్లిపోయిన లోటును భర్తీ చేయడం ద్వారా మేం కొంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని శ్రీలంక బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

అయితే 1996లో శ్రీలంకలో క్రికెట్ ఆడేందుకు భారత్‌తో పాటు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా వెళ్లారు. అజహరుద్దీన్ సార థ్యంలో పాక్, భారత్ ఆటగాళ్లు కలిసి ఒక జట్టుగా ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. శ్రీలంకలో భద్రత సమస్యలు లేవని చెప్పేందుకు దీనిని నిర్వహించారు. అయితే మరి అప్పుడు సాయం చేసిన పాక్... ఇప్పుడు ఎన్నిసార్లు రమ్మని పిలిచినా శ్రీలంక ఆ దేశం వైపు చూడటం లేదు. వెళ్లే సాహసం చేయడం లేదు. మరి పాక్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? అని లంక పత్రికలు ఆ దేశ బోర్డును విమర్శించాయి.

 కారణాలు ఏవైనా... ఎవరికి ఇష్టం లేకపోయినా భారత్‌తో శ్రీలంక ఐదు వన్డేలు ఆడటం ఖాయం. ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో భారత్ జట్టు ఆడబోయే ఆఖరి సిరీస్ ఇది. దీనిలో గెలవడం చాలా అవసరం. వెస్టిండీస్‌తో పోలిస్తే శ్రీలంక మెరుగైన జట్టు. కాబట్టి మన యువ జట్టు సత్తాకు ఈ సిరీస్ పరీక్షే అనుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement