శ్రీజ సంచలనం
టెహరాన్: హైదరాబాద్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి... 15 ఏళ్ల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇరాన్‌లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 3-0 (11-9, 14-12, 11-7) తేడాతో బెలారస్‌కు చెందిన బరవోక్‌ను చిత్తు చేసింది. విజేతగా 800 డాలర్ల ప్రైజ్‌మనీని అందుకుంది. క్యాడెట్ విభాగంలో ప్రపంచ 23వ ర్యాంకర్ అయిన శ్రీజ ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది. సెమీస్‌లో హంగెరీకి చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణిని మట్టికరిపించి శ్రీజ అందరి దృష్టినీ ఆకర్శించింది. మరోవైపు జూనియర్స్ సింగిల్స్‌లో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు టీమ్ ఈవెంట్‌లోనూ శ్రీజ రాణించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
అలాగే డబుల్స్ ఈవెంట్‌లో శ్రీజ, ప్రియదర్శిని (బెంగాల్) కలిసి కాంస్యం సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ మొత్తం 12 పతకాలు సాధించడం విశేషం.
డబుల్స్‌లో నైనా జోడికి స్వర్ణం: ఇదే టోర్నీ డబుల్స్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నైనా జైస్వాల్ జోడి స్వర్ణం సాధించింది. బెంగాల్‌కు చెందిన మోమితా దత్తాతో జత కట్టిన నైనా 11-8, 9-11, 11-9, 11-6 తేడాతో సబా సఫారీ, మషీద్ (ఇరాన్)ను ఓడించింది. బాలికల క్యాడెట్ టీమ్ ఈవెంట్‌లోనూ నైనా, దత్తా జోడి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ప్రపంచ ర్యాంకింగ్స్ ఆటగాళ్లు ఫజర్ కప్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇప్పటిదాకా ఇదే నా అత్యుత్తమ ప్రదర్శనగా భావిస్తున్నాను. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, కోచ్ సోమ్‌నాథ్‌కు అంకితమిస్తున్నాను’
- శ్రీజ.
‘దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఒక్కరి కల. అలాంటి అవకాశాన్ని మా అమ్మాయి ఇంత చిన్న వయసులోనే చేజిక్కించుకోవడం, చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం గొప్ప విషయం. ఆమె ఘనవిజయాల పట్ల మేం గర్వపడుతున్నాం.’
- ప్రవీణ్, సాయిసుధ (శ్రీజ తల్లిదండ్రులు)