
కివీస్ 60 ఆలౌట్: శ్రీలంక సంచలన విజయం
చిట్టగాంగ్: ట్వంటీ 20 ప్రపంచ కప్ లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ రోజు ఇక్కడ న్యూజిలాండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో లంకేయులు 59 పరుగుల తేడాతో ఘన విజయాన్నినమోదు చేసుకుని సెమీఫైనల్ కు దూసుకెళ్లారు. శ్రీలంక విసిరిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీలు ఆది నుచీ ఆపసోపాలు పడ్డారు. లంక బౌలింగ్ ధాటికి నిలబడలేక కివీస్ ఆటగాళ్లు విలవిల్లాడారు. కివీస్ ఆటగాళ్లలో కేన్ విలియమ్ సన్ (42 ) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు రెండంకెల మార్కును దాటలేకపోయారు.
దీంతో 15.3 ఓవర్లలో 60 పరుగులకే పరిమితమైన కివీస్ ఘోర ఓటమిని మూటగట్టుకుని సెమీస్ ఆశలను నీరుగార్చుకుంది. లంక ఆటగాళ్లు సమిష్టిగా రాణించి కివీస్ కు షాకిచ్చారు. లంక స్పిన్నర్ రంగనా హెరాత్ ఐదు వికెట్లు తీసి కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చగా, సేననాయకేకు రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ లో 10 మంది కివీస్ ఆటగాళ్లు 5 అంకె మార్కును దాటలేకపోవడం గమనార్హం.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే చుక్కెదురైంది. తిలకరత్నే దిల్షాన్ (8) పరుగులకే పెవిలియన్ చేరి లంక అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం మరో ఓపెనర్ జనీత్ పెరీరా(16)పెవిలియన్ బాటపట్టడంతో లంకేయులు మరమ్మత్తులు చేపట్టారు. కీలకమ్యాచ్ కావడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. తరువాత వచ్చిన ఆటగాళ్లలో జయవర్ధనే(25), తిరుమన్నే (20)మినహా ఎవరూ రాణించకపోవడంతో లంకేయులు 19.2 ఓవర్లలో 119 పరుగులకే పరిమితమైయ్యారు.