సాక్షి, స్పోర్ట్స్ : గత కొంత కాలంగా పరాజయాలతోపాటు సొంత ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న శ్రీలంక జట్టు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఒకే ఏడాది అన్ని ఫార్మట్‌లలో అత్యధిక ఓటములను మూటగట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ కేలండర్ ఇయర్‌లో మొత్తం 33 పరాజయాలను లంక జట్టు చవిచూసింది.
వీటిలో 21 వన్డేలు ఉండటం విశేషం. గతంలో ఈ రికార్డు జింబాబ్వే పేరుపై ఉండగా, శ్రీలంక ఇప్పుడు ఆ స్థానంలో వచ్చి చేరింది. పాకిస్థాన్-శ్రీలంక మధ్య శుక్రవారం దుబాయ్‌లో జరిగిన రెండో టీ20 శ్రీలంక ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 124 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 125 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ ఓ బంతి మిగిలి ఉండగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరోవైపు ఇదే మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాక్ సరికొత్త రికార్డును లిఖించింది. టీ20 చరిత్రలో వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఇదే జట్ల మధ్య ఇది వరకు జరిగిన వన్డే సిరీస్‌ను 5-–0 తేడాతో పాక్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment