
పోర్ట్ ఎలిజిబెత్: దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 128 పరుగులకే కుప్పకూల్చిన లంకేయులు పైచేయి సాధించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో కెప్టెన్ డుప్లెసిస్(50 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో లంకకు 197 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా నిర్దేశించింది. లంక బౌలర్లలో సురంగా లక్మల్ నాలుగు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా, ధనంజయ డిసిల్వ మూడు వికెట్లు సాధించాడు. ఇక కసున్ రజితాకు రెండు వికెట్లు లభించగా, విశ్వ ఫెర్నాండోకు వికెట్ దక్కింది.
అంతకుముందు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ టెస్టు మ్యాచ్ గురువారం ఆరంభం కాగా, శుక్రవారం రెండో రోజుకే లక్ష్యం వరకూ వచ్చేయడం గమనార్హం. ఇంకా రెండు రోజుల ఆట పూర్తి కాకుండాను ఇరు జట్లు కోల్పోయిన వికెట్లు 32.
Comments
Please login to add a commentAdd a comment