లంకదే వన్డే సిరీస్
రెండో మ్యాచ్‌లోనూ ఓడిన బంగ్లాదేశ్
సంగక్కర సెంచరీ
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న మాథ్యూస్‌సేన గురువారం జరిగిన రెండో వన్డేలో 61 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది.
సంగక్కర (115 బంతుల్లో 128; 14 ఫోర్లు) సెంచరీ చేయగా, ప్రియాంజన్ (97 బంతుల్లో 60; 7 ఫోర్లు), మాథ్యూస్ (39 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా ఆడారు. రూబెల్ హుస్సేన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటై ఓడింది. ముష్ఫీకర్ రహీమ్ (83 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనాముల్ హక్ (46 బంతుల్లో 42; 7 ఫోర్లు), షకీబ్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్సర్), నాసిర్ హుస్సేన్ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్సర్) కాసేపు పోరాడారు. మలింగ, సేననాయకే, తిసారా పెరీరా, అజంతా మెండిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కెరీర్‌లో 17వ సెంచరీ సాధించిన సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఢాకాలో శనివారం జరుగుతుంది.