హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌లో జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అపూర్వ చేజిక్కించుకుంది. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ కార్యాలయంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ (ఇండియన్ ఆయిల్) 9-25, 25-0, 18-16తో వి. అనిల్ కుమార్ (ఏజీ ఆఫీస్)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ఓటమి ఎదురైనా తర్వాతి గేముల్లో విజయంతో శ్రీనివాస్ టైటిల్ సాధించాడు.
మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎం.డి. అహ్మద్ (హైదరాబాద్) 20-12, 8-21, 25-10తో సూర్యప్రకాశ్ (ఆర్‌బీఐ)పై గెలుపొందాడు. దీంతో అహ్మద్‌కు కాంస్య పతకం లభించింది. సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న అనిల్... రవీందర్ గౌడ్‌తో కలిసి డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఈ జోడి 22-16, 15-4తో సూర్యప్రకాశ్-ఆదిత్య జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ ఎస్. అపూర్వ (ఎల్‌ఐసీ) 25-1, 24-6తో సవితా దేవి (పోస్టల్)పై అలవోక విజయం సాధించింది. కాంస్య పతకపోరులో ఎస్. నందిని (డెలాయిట్) 25-5, 25-0తో శ్రీచందన (నిజామాబాద్)పై నెగ్గింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్‌టీపీసీ సదర్న్ రీజియన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ వి.బి.ఫడ్నవిస్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు వివేక్ దేశ్‌పాండే, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బి.కె.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.