ఎదురులేని శ్రీనివాసన్!
చెన్నై: చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎంత మంది అడ్డుకోవాలని ప్రయత్నించినా... బీసీసీఐలో తనకు ఎదురులేదని శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. నేడు (ఆదివారం)జరిగే బీసీసీఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఇక ఎన్నిక లాంఛనమే కానుంది.
అయితే సుప్రీం కోర్టులో బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) వేసిన పిటిషన్ కారణంగా ఆ తీర్పు వచ్చేదాకా శ్రీనివాసన్ ఎన్నికైనా బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీంతో దాల్మియానే అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగించే వీలుంది. అయితే సంతకాలు చేసే అధికారాన్ని మాత్రం దాల్మియాకు ఇచ్చేందుకు శ్రీనివాసన్ ఇష్టపడడం లేదు. ఈ విషయంలో కార్యదర్శి సంజయ్ పటేల్ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డు చీఫ్ బరిలో శశాంక్ మనోహర్, శరద్ పవార్‌లు పోటీలో నిలుస్తారని కథనాలు వెలువడినప్పటికీ వారిద్దరి నుంచి ఇప్పటిదాకా స్పందన కనిపించలేదు.
అలాగే ఏజీఎంలో ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లా స్థానంలో ఎవరిని నియమించనున్నారో తేలనుంది. దాల్మియా పేరు వినిపిస్తున్నప్పటికీ ఈ బాధ్యతలో ఉన్నవారు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి ఉండడంతో ఎవరైనా యువ పరిపాలకుడిని నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. హర్యానా సంఘం చీఫ్ అనిరుధ్ చౌధురి పేరు ఈ పోస్ట్‌కు ముందు వరుసలో ఉంది.
నూతన ఉపాధ్యక్షుడిగా శుక్లా
ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా బీసీసీఐ నూతన ఉపాధ్యక్షుడిగా నియామకం కానున్నారు. ఆయనతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి సావంత్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి స్నేహ్ బన్సాల్ కూడా ఉపాధ్యక్షులుగా ఎంపికవనున్నారు.
ఇప్పటిదాకా ఉపాధ్యక్షులుగా కొనసాగిన అరుణ్ జైట్లీ, నిరంజన్ షా, సుధీర్ దబీర్ వివిధ కార ణాల రీత్యా తమ పదవుల పొడిగింపునకు నిరాకరించారు. నేటి ఏజీఎంలో వీరి ఎంపిక ఖరారు కానుంది. 2014 సాధారణ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సి రావడంతో బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ బోర్డు ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే దబీర్, షా మార్పు వెనుక పలు కథనాలు వినిపిస్తున్నాయి. దబీర్.. శశాంక్ మనోహర్‌కు, షా.. శరద్ పవార్‌కు సన్నిహితం కాబట్టే ఉద్వాసన పలికారని సమాచారం. చిత్రక్ మిత్రా (బెంగాల్), శివలాల్ యాదవ్ (హైదరాబాద్) ఉపాధ్యక్షులుగా మరో ఏడాదిపాటు కొనసాగుతారు.
ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లు:
అధ్యక్షుడు: శ్రీనివాసన్, కార్యదర్శి: సంజయ్ పటేల్, కోశాధికారి: అనిరుధ్ చౌధురి, సంయుక్త కార్యదర్శి: అనురాగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులు: సావంత్ (వెస్ట్), శుక్లా (సెంట్రల్), ఎస్పీ బన్సాల్ (నార్త్), శివలాల్ (సౌత్), చిత్రక్ మిత్రా (ఈస్ట్).