
శ్రీనివాసన్‌కు పోటీ తప్పదా!
న్యూఢిల్లీ: మరో ఏడాది పాటు బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు పొడిగించుకునేందుకు ఎన్.శ్రీనివాసన్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 29న చెన్నైలో బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరుగనుంది. అంతలోపు వీలైనంత మద్దతు కూడగట్టుకోవాలని శ్రీని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఉన్న బోర్డు గుర్తింపు సంఘాల ప్రతినిధులను చెన్నైకి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), కేరళ సీఏ, కర్ణాటక స్టేట్ సీఏ హాజరు కాగా గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ), ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాత్రం డుమ్మా కొట్టాయి. దీంతో అధ్యక్ష పదవి కోసం ఎన్నిక అనివార్యం కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘చెన్నైలో సమావేశం కోసం బీసీసీఐ దక్షిణాది యూనిట్స్‌ను బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ పిలిచిన విషయం వాస్తవమే. అయితే కొన్ని పనుల వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోయాను. ఆయన మా మద్దతు కోసం ఈ మీటింగ్ పెట్టారా? అనేది అంతర్గత వ్యవహారం. ఆ విషయాలు నేనేమీ చెప్పలేను’ అని జీసీఏ అధ్యక్షుడు వినోద్ ఫడ్కే అన్నారు.
శ్రీనికి పోటీగా శశాంక్ మనోహర్!
ఇదిలావుండగా మొత్తం 31 యూనిట్లలో చాలా వరకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను శ్రీనికి పోటీగా ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టు, జీసీఏనే ఆయన పేరును ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఫడ్కే స్పందిస్తూ ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల సమర్పణకు చివరి తేది ఈనెల 28. పదవి కోసం బరిలోకి దిగే వ్యక్తి పేరును మరో జోన్ బలపరచాల్సి ఉంటుంది.