‘వావ్’రింకా...
ఉదయం
గం. 5.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో
ప్రత్యక్ష ప్రసారం
రోజుకో సంచలనంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ హోరెత్తుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో మొన్న సెరెనా, నిన్న షరపోవా ఇంటిదారి పట్టగా... తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలోనూ అనూహ్య ఫలితాలు వచ్చాయి. ‘హ్యాట్రిక్’ చాంపియన్ నొవాక్ జొకోవిచ్... మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేశారు. వరుసగా నాలుగో ఏడాదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అరుదైన రికార్డు సాధిస్తాడని ఆశించిన జొకోవిచ్‌కు షాక్ ఇచ్చిన స్టానిస్లాస్ వావ్రింకా... ఫెరర్‌ను బోల్తా కొట్టించిన బెర్డిచ్ ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
మెల్‌బోర్న్: కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి. స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదే చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో చిరస్మరణీయ విజయం సాధించాడు. ఇన్నాళ్లూ ఫెడరర్ నీడలో వెనుకబడిపోయిన స్విట్జర్లాండ్ ఆటగాడు వావ్రింకా ఈసారి అద్భుతమే చేశాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గత మూడేళ్లుగా చాంపియన్‌గా నిలుస్తున్న జొకోవిచ్ జోరుకు పగ్గాలు వేశాడు. సరిగ్గా నాలుగు గంటలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన క్వార్టర్ ఫైనల్ సమరంలో ఈ స్విట్జర్లాండ్ ప్లేయర్ 2-6, 6-4, 6-2, 3-6, 9-7తో జొకోవిచ్‌ను కంగుతినిపించాడు. జొకోవిచ్ చేతిలో వరుసగా 14 సార్లు ఓడిపోయిన వావ్రింకా ఆ అన్ని పరాజయాలకు ఈ ఒక్క విజయంతో బదులు తీర్చుకున్నాడు.
2006లో చివరిసారి జొకోవిచ్‌పై నెగ్గిన వావ్రింకా గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో... యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ఐదు సెట్‌ల పోరాటాల్లో ఓటమి చవిచూశాడు. అయితే జొకోవిచ్‌తో మూడోసారి జరిగిన ఐదు సెట్‌ల మారథాన్ మ్యాచ్‌లో మాత్రం వావ్రింకాను విజయం వరించింది.
2010లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత జొకోవిచ్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. అతను ఆడిన చివరి 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో... నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరుకోగా... ఐదింటిలో టైటిల్ నెగ్గి... మరో ఐదింటిలో రన్నరప్‌గా నిలిచాడు. మొత్తానికి గతేడాది రాఫెల్ నాదల్‌కు నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయిన జొకోవిచ్‌కు... కొత్త కోచ్‌గా బోరిస్ బెకర్ నియామకం అంతగా కలిసిరాలేదు.
క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్‌ను కూడా కోల్పోని జొకోవిచ్‌కు ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే గట్టిపోటీ ఎదురైంది. రెండు వారాల క్రితం చెన్నై ఓపెన్‌లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన వావ్రింకా అదే జోరును కొనసాగించాడు.
17 ఏస్‌లతో విజృంభించిన ఈ ఎనిమిదో సీడ్ తొలి సెట్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్‌లలో నెగ్గాడు. నాలుగో సెట్‌లో తడబడ్డా ఐదో సెట్‌లో కోలుకున్నాడు. 79 నిమిషాలపాటు జరిగిన చివరి సెట్‌లో ఇద్దరూ హోరాహోరాగా పోరాడు. 16వ గేమ్‌లో జొకోవిచ్ సంధించిన క్రాస్‌కోర్టు వాలీ షాట్ బయటకు వెళ్లడంతో వావ్రింకా విజయం ఖాయమైంది.
సానియా జోడి ఓటమి
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడి సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 3-6, 6-4తో సానియా-కారా బ్లాక్ జంటపై గెలిచింది.
నిర్ణాయక మూడో సెట్‌లో సానియా ద్వయం 4-1తో ఆధిక్యంలో నిలిచి సంచలన విజయందిశగా సాగింది. అయితే అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న సానియా జంట వరుసగా ఐదు గేమ్‌లను కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. బాలికల డబుల్స్ రెండో రౌండ్‌లో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి వేణుగోపాల్ (భారత్) జంట 1-6, 2-6తో టాప్ సీడ్ కలినీనా (ఉక్రెయిన్)-కులిచ్‌కోవా (రష్యా) జోడి చేతిలో పరాజయం పాలైంది.
భళా... బౌర్డిచ్
మహిళల సింగిల్స్ విభాగంలో ‘కెనడా బ్యూటీ’ యూజినీ బౌర్డిచ్ తన విజయపరంపర కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 30వ సీడ్ బౌర్డిచ్ 5-7, 7-5, 6-2తో 14వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ఈ గెలుపుతో బౌర్డిచ్ 1984 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-2తో 28వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్లో బౌర్డిచ్‌తో నా లీ పోటీపడుతుంది.
ఫెరర్‌కూ షాక్
మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-4, 2-6, 6-4తో మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)ను ఓడించాడు. వరుసగా 11వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న బెర్డిచ్ ఈ గెలుపుతో తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో వావ్రింకాతో బెర్డిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో వావ్రింకా 8-5తో ఆధిక్యంలో ఉన్నాడు.
నవంబర్‌లో రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో ఇండియన్ రెజ్లింగ్ లీగ్ (ఐడబ్య్లుఎల్) ప్రారంభం కానుంది.
జనవరి ఆఖరుకల్లా ఆరు నగరాలతో కూడిన ఫ్రాంచైజీలను నిర్వాహకులు ప్రకటించనున్నారు.
మూడు వారాల పాటు లీగ్ జరుగుతుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈ లీగ్‌ను ప్రకటించారు.
వాస్తవానికి గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది.
హాకీ ఇండియా లీగ్ విజేతకు భారీ మొత్తం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) రెండో ఎడిషన్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2.5 కోట్ల మొత్తం దక్కనుంది. ఈ శనివారం నుంచే లీగ్ ప్రారంభం కానుంది.
రన్నరప్‌కు రూ.1.25 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 లక్షలు దక్కుతాయి.
నాలుగు వారాల పాటు ఢిల్లీ, ముంబై, మొహాలీ, భువనేశ్వర్, రాంచీ, లక్నోలో మ్యాచ్‌లు జరుగుతాయి.
ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి రూ.25 లక్షలు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి రూ.10 లక్షలు ఇస్తారు.
నేటి ముఖ్య మ్యాచ్‌లు
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్
సిమోనా హలెప్ (11) x సిబుల్కోవా (20)
అజరెంకా (2) x రద్వాన్‌స్కా (5)
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్
రాఫెల్ నాదల్ (1) xదిమిత్రోవ్ (22)
ఆండీ ముర్రే (4) x ఫెడరర్ (6)
‘‘ఏ దశలోనూ డీలా
పడకుండా ఆద్యంతం దూకుడుగా ఆడాలని
నిర్ణయించుకున్నాను. చివర్లో కండరాలు పట్టేయడంతో కాస్త ఆందోళన చెందాను. అయితే పట్టుదలతో ఆడి విజయాన్ని అందుకున్నాను. ఈ గెలుపుతో చాలా... చాలా... చాలా సంతోషంగా
ఉన్నాను.’’
-వావ్రింకా