'స్టీవ్ స్మిత్ వల్లే సక్సెస్ అయ్యా'
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్. తొలి నాలుగు మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ ఆ తరువాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ 22 వికెట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉనాద్కత్.. ఇందుకు కారణం తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అని పేర్కొన్నాడు.
'స్టీవ్ స్మిత్-ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం నాకు చాలా ఉపయోగపడింది. వారిద్దర వద్ద ఆడటం నాకొక మంచి అనుభవం. ఈ సీజన్ లో ఆఖరి ఓవర్లను ఎక్కువగా వేశా. డెత్ ఓవర్లను వేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కెప్టెన్ నుంచి సహకారం అవసరం. అటువంటి సహకారం నాకు స్మిత్ నుంచి అందింది. నాపై నమ్మకం ఉంచడంతోనే నా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా. స్టీవ్ స్మిత్ కు బౌలర్లకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దాంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపడం కూడా తెలుసు'అని ఉనాద్కత్ పేర్కొన్నాడు.