
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్
కేప్‌టౌన్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు చివరి రెండు రోజులకు ఆసీస్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో జేమ్స్ సదర్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వివాదం నేపథ్యంలో స్మిత్, వార్నర్‌లతో చర్చించామని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అంగీకరించారని చెప్పారు. ఈ మ్యాచ్ జరుగుతుండగానే వేగంగా విచారణ పూర్తి చేస్తామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలుంటాయన్నారు. టిమ్ పైన్ కెప్టెన్సీలోనే స్మిత్, వార్నర్‌లు మూడో టెస్టు చివరి రెండు రోజులు ఆడనున్నారని పేర్కొన్నారు.
ఈ ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్‌పై ఆరోపణలు రావడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తం అయ్యింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు ఆసీస్ స్పోర్ట్స్ కమిషన్ అధికారులు సైతం స్మిత్‌ను బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టెస్టు మ్యాచ్ వరకు తమ బాధ్యతల నుంచి స్మిత్, వార్నర్‌లు తప్పుకున్నారు.
మూడో టెస్టు మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాఫ్ట్ పసుపు రంగు టేపుతో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడు. ఇది కెమెరాల్లో స్పష్టం అయింది. దీంతో అంపైర్లు వివరణ కోరగా ఏమి లేదని సన్‌గ్లాస్ తుడిచే నల్లటి వస్త్రం అని బుకాయించాడు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు. అయితే అంపైర్లకు చూపించింది వేరు అని వీడియోలో స్పష్టం కావడంతో ట్యాంపరింగ్ యత్నం జరిగిందని రుజువైంది. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని జట్టు సమష్టి నిర్ణయమని నిస్సిగ్గుగా చెప్పుకున్న స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను చూసి క్రీడాభిమానులు నివ్వెరపోతున్నారు.