
'చెత్త బ్యాటింగే మా కొంపముంచింది'
పల్లెకెలె: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చాలా అసహనంతో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగుల ఆధిక్యంలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులకే ఆలౌటవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాట్స్ మన్ చెత్త ఆట ఆటడం వల్లే ఆసీస్ కు ఓటమి తప్పలేదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో క్రమశిక్షణ లోపించడం వల్లే 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోయామని ఆసీస్ కెప్టెన్ వెల్లడించాడు. ఉపఖండంలో ఆట చాలా జాగ్రత్తగా ఆడాలని జట్టును హెచ్చరించాడు. బౌలర్లు శక్తివంచన లేకుండా పోరాటం చేశారని ప్రశంసించాడు.
ఓ వైపు 17 ఏళ్ల తర్వాత తమ జట్టుపై లంకేయులు విజయం సాధించామని సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు తన కెప్టెన్సీలో తొలి ఓటమి కావడంతో ఆందోళన చెందుతున్నాడు. హెరాత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడంపై స్పందిస్తూ.. ఉపఖండం పిచ్ అంటేనే స్పిన్నర్లకు స్వర్గధామమని పేర్కొన్నాడు. చివర్లో నెవిల్, కీఫ్ తొమ్మిదో వికెట్‌కు 178 బంతులు ఎదుర్కొని పోరాటం సాగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నమోదయిన ఏకైక హాఫ్ సెంచరీ స్టీవ్ స్మిత్ చేశాడు.