
ద్రవిడ్ సర్ మా కోచ్ అంటే నమ్మకంగా లేదు..
కోల్ కతా:'ద్రవిడ్ సర్ మా కోచ్ అంటే నమ్మశక్యంగాలేదు. నేను ఇప్పటికీ ద్రవిడ్ సర్ శిక్షణలో పని చేస్తున్నానన్న నమ్మకం కల్గడం లేదు. ద్రవిడ్ సెంచరీలు చేయడాన్ని టీవీల్లో చూసేవాణ్ని. ఇప్పుడు ఆయన జట్టుకు కోచ్ గా పనిచేస్తూ మా పక్క గదిలో ఉంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది' అని అండర్-19 ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ జరిగిన తుదిపోరులో సర్ఫరాజ్ (59; 27 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు) వీర విహారం చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
దీనిలో భాగంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ.. అండర్ 19 జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. ద్రవిడ్ సెంచరీలు చేయడాన్ని టీవీల్లో తిలకించిన తనకు ఆయనతో అనుభవాలను పంచుకోవడం గర్వంగా ఉందని సర్ఫరాజ్ స్పష్టం చేశాడు. వచ్చే వరల్డ్ కప్ కు ద్రవిడ్ అనుభవం తమ జట్టుకు ఎంతోగాను ఉపయోగపడుతుందన్నాడు. గత మూడు మ్యాచ్ ల్లో తాను పేలవంగా ఆడినా .. ద్రవిడ్ సర్ ఏమీ అనలేదన్నాడు. సహజసిద్ధంగా ఆడమని మాత్రమే ద్రవిడ్ సర్ తనకు చెప్పారన్నాడు. అదే ఈరోజు మ్యాచ్ లో ఉపయోగపడిందన్నాడు. ద్రవిడ్ సర్ ప్రశాంతంగా ఉంటూ జట్టు సభ్యులకు అమూల్యమైన సలహాలను ఇస్తుంటారని సర్ఫరాజ్ తెలిపాడు. ఒక బ్యాటింగ్ లెజెండ్ తో కలిసి పనిచేయడాన్ని తమ జట్టు సభ్యులు ఆస్వాదిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.