10 ఓవర్లు.. 5 మేడిన్లు.. 6 వికెట్లు!
షాన్ పొలాక్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడీ దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్. తన ప్రతిభా సామర్థ్యాలతో అనేకసార్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2000 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా టీమ్ కు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాదు కౌంటీ క్రికెట్ లోనూ సత్తా చాటాడు. 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో తొలి కౌంటీ మ్యాచ్ ఆడిన పొలాక్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.
1996, ఏప్రిల్ 26న లీచెస్టర్ షైర్ టీమ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో 6 వికెట్లు పడగొట్టి వార్విక్ షైర్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 10 ఓవరల్లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి అరడజను వికెట్లు నేలకూల్చాడు. ఇందులో 5 మేడిన్ ఓవర్లు ఉన్నాయి. అంతేకాదు 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను ట్విటర్ ద్వారా పొలాక్ గుర్తు చేశాడు. తొలి కౌంటీ మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు. ఆ రోజు తాను వేసి ప్రతి బంతి, ఎమోషన్ ఇప్పటికీ తనకు గుర్తున్నాయని ట్వీట్ చేశాడు.
20 yrs on!Surreal experience-1st day County nerves, still clearly remember each ball & the emotion that went with it https://t.co/OSTYtKY1VY
— Shaun Pollock (@7polly7) 26 April 2016