న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ చేజారడానికి కెప్టెన్ విరాట్ కోహ్లి అనాలోచిత నిర్ణయాలే కారణమని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో పరాజయం పాలై 3-2తో సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సిరీస్ గెలవకముందే ప్రయోగాలు చేయడం భారత పరాజయానికి కారణమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్ చేజారిందన్నాడు. తొలి రెండు వన్డేలు గెలిచి ఆధిపత్యం కనబర్చిన భారత్.. మరో మ్యాచ్ గెలిచాక ప్రయోగాలు చేయాల్సిందన్నాడు. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్‌ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్‌లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
మూడో వన్డే ఓటమి అనంతరం మహేంద్రసింగ్ ధోనికి విశ్రాంతినివ్వడం.. సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై వేటు వేయడం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. ధోని స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ వరుస తప్పిదాలు చేయగా.. కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆఖరి వన్డేలోనూ అదనపు బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ని తప్పించి మరీ ఒక బౌలర్‌ని తీసుకోవడంతో ఛేదనలో భారత్‌కి ఇబ్బందిగా మారింది. దీంతో భారత్ చేజేతులా వన్డే సిరీస్‌ను కోల్పోయినట్లైంది. మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగియగానే రెండు వారాల వ్యవధిలో వరల్డ్‌కప్ ఆరంభమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment