
న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతోన్న భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ సారథి సునీతా లక్రా గురువారం ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో గత గాయం తిరగబెట్టడంతో తాను రిటైర్ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొంటున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా.
అయితే నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ చేయించుకున్నా ఒలింపిక్స్ లోపు పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం లేదు’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొంది. 2008లో అరంగేట్రం చేసిన సునీత భారత్ తరఫున 139 మ్యాచ్‌లు ఆడింది. ఆమె నాయకత్వంలోని జట్టు 2018 ఆసియా చాంపియన్‌షిప్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సునీత 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టులో సభ్యురాలు.
Comments
Please login to add a commentAdd a comment