ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా.. | Sunrisers face with Mumbai today | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా..

Published Sun, May 7 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా..

ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా..

నేడు ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్‌
వరుస ఓటముల ఒత్తిడిలో హైదరాబాద్‌
నాకౌట్‌ చేరిన ఉత్సాహంలో రోహిత్‌సేన


హైదరాబాద్‌: వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్లే ఆఫ్స్‌లో చోటే లక్ష్యంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో తీవ్ర ఒత్తిడిలో వార్నర్‌సేన ఈ మ్యాచ్‌ ఆడుతోంది. మరోవైపు ఇప్పటికే నాకౌట్‌పోరుకు అర్హత సాధించిన ముంబై .. జట్టు రిజర్వ్‌బెంచ్‌ను  పరిశీలించేందుకు కోసం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.

విజయంతో ముగింపు..
ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఐదింటిలో విజయం సాధించింది. శనివారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ మ్యాచ్‌ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి నమోదు చేసింది. పుణే విధించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్, యువరాజ్‌ సింగ్‌ ఆకట్టుకున్నా మిగతా ప్లేయర్లు శిఖర్‌ ధావన్, కేన్‌ విలియమ్సన్, నమన్‌ ఓజా తదీతరులు విఫలమవడం జట్టు కొంపముంచింది. ఈ క్రమంలో జట్టు మిడిలార్డర్‌ మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది.

వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దవడంతో మొత్తం 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతుంది.  సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వార్నర్‌సేన భారీ విజయాలు నమోదు చేయాల్సిందే. దీంతో సోమవారం మ్యాచ్‌లో విజయంపై హైదరాబాద్‌ దృష్టి పెట్టింది. మరోవైపు ఈ సీజన్‌ ఇరుజట్లు పరస్పరం తలపడగా ముంబై నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని వార్నర్‌సేన భావిస్తోంది. బ్యాటింగ్‌లో వార్నర్, ధావన్, యువీ, విలియమ్సన్‌ ఆకట్టుకుంటుండగా.. నమన్, బిపుల్‌ శర్మ సత్తా చాటాల్సిన అవసరముంది. బౌలింగ్‌ విషయానికొస్తే 21 వికెట్లతో టోర్నీలోనే భువనేశ్వర్‌ అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్‌ (డేవిడ్‌ వార్నర్‌)కు ఇచ్చే ‘ఆరెంజ్‌ క్యాప్‌’, అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌ (భువనేశ్వర్‌)కు ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌లు రెండు హైదరాబాద్‌ సొంతమయ్యాయి. ఇది చాలు హైదరాబాద్‌ జోరు చెప్పడానికి. ఇదే ఊపును కొనసాగించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. మరోవైపు టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న సన్‌రైజర్స్‌.. ముంబైతో మ్యాచ్‌లో ఆ స్థాయి ఆటతీరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది.

ముంబై దూకుడు..
ఈ సీజన్‌లో అందరింకంటే ముందుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ ఘనత వహించింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన ముంబై కీలకమైన నాకౌట్‌ సమరానికి ముందు జట్టు రిజర్వ్‌ బెంచ్‌ సత్తాను పరిశీలించాలనుకుంటోంది. ఈక్రమంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో లెండిల్‌ సిమ్మన్స్‌ను బరిలోకి దించింది. ఈ మార్పు సానుకూల ఫలితాన్నిచ్చింది. ఢిల్లీపై 212 పరుగుల భారీస్కోరు చేసిన ముంబై.. ప్రత్యర్థిని కేవలం 66 పరుగులకే పరిమితం చేసి 146 రన్స్‌ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ విజయం ముంబై ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహంలేదు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే రోహిత్‌ శర్మ, సిమన్స్, పోలార్డ్, నితీశ్‌ రాణా, పార్థివ్‌ పటేల్‌లతో బలంగా ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, కృనాల్‌ పాండ్య సోదరులు ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్‌ విషయానికొస్తే మిషెల్‌ మెక్లీనగన్, హర్భజన్‌ సింగ్, లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రాలతో బలంగా ఉంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కన్పిస్తోన్న ముంబై.. సోమవారం మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement