సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆ జట్టు తక్కువ లక్ష్యాలను కాపాడుకోవడమే కాదు...ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ఛేదనలోనూ గెలవగలమని నిరూపించింది. నిజానికి అదేమీ భారీ లక్ష్యం కాదు. ఓవర్‌కు 8 పరుగులకంటే కాస్త ఎక్కువగా మాత్రమే చేయాల్సి ఉంది. అయితే రన్‌రేట్ భారీగా పెరిగిపోయినా తాము దానిని అందుకోగలమని రైజర్స్ చూపించింది. కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు అనుసంధానకర్తలా సమర్థంగా పని చేస్తున్నాడు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి కాబట్టి గత ఏడాది విలియమ్సన్‌కు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కలేదు.
ఆ సమయంలో నాటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో అందరికంటే కీలక పాత్ర పోషించాడు. ఈ సారి వార్నర్ లేకపోవడంతో పాటు కెప్టెన్‌గా కూడా విలియమ్సన్‌పై అదనపు బాధ్యత పడింది. ఈ కివీస్ కెప్టెన్ తన ఆటను అన్ని రకాలుగా మెరుగుపర్చుకొని బ్యాట్స్‌మన్ అంటే చితకబాదేవాడు మాత్రమే కాదని నిరూపించాడు. పైగా ఎంతో నిలకడగా ఆడాడు. అన్నింటికి మించి క్లిష్ట సమయాల్లో కూడా అతను సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా కనిపిస్తూ ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేస్తున్నాడు.
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడం దాదాపు ఖాయం కాగా... మరోవైపు వారి ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరు నమోదు చేయడంతో ఓటమితోపాటు రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అలాంటి చిన్న స్కోర్లు జట్టుకు మేలు చేయవు. మరోసారి బెంగళూరు చెత్త ఫీల్డింగ్‌తో సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో చెన్నై గెలిచింది. వారికి ఉన్న బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఆ జట్టు ప్రతీ మ్యాచ్‌లో కనీసం 180 పరుగులైనా చేయాల్సిందే. గత ఏడాది వారి బౌలింగ్ మరీ చెత్తగా ఉండి జట్టుకు ఘోర పరాభవాలు మిగిల్చింది. ఈసారి ఉమేశ్, చహల్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు కానీ వారు ఒక్క చెత్త ఓవర్ వేసినా కోలుకోగలిగేంత కనీస స్కోరు కూడా బెంగళూరు చేయడం లేదు. సన్‌రైజర్స్ జోరు కొనసాగించాలని కోరుకుంటుండగా, బెంగళూరు దానికి బ్రేక్ వేయగలుగుతుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment