సొంతగడ్డపై హైదరాబాద్‌కు ఓటమి
35 పరుగులతో బెంగళూరు గెలుపు
పటిదార్, కోహ్లి అర్ధసెంచరీలు
రాణించిన ఆర్‌సీబీ బౌలర్లు
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్‌రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్‌లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.
వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండో విజయం దక్కింది.
సాక్షి, హైదరాబాద్: సీజన్‌లో తిరుగులేకుండా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.
అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
పటిదార్ మెరుపులు...
భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.
అయితే మరో ఎండ్‌లో పటిదార్ విధ్వంసం ఆర్‌సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్‌స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్‌సీబీ 64 పరుగులు చేసింది.
టపటపా...
తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
మార్క్‌రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దాంతో సన్‌రైజర్స్‌కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్‌రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్‌రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X పంజాబ్
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment