కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు | Did Not Hit A Boundary From 31 To 32: Gavaskar Rips Into Virat Kohli Vs SRH | Sakshi
Sakshi News home page

కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు

Published Fri, Apr 26 2024 9:42 AM | Last Updated on Fri, Apr 26 2024 7:18 PM

Did Not Hit A Boundary From 31 To 32: Gavaskar Rips Into Virat Kohli Vs SRH

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్‌- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్‌ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ బౌలింగ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లితో పాటు రజత్‌ పాటిదార్‌(20 బంతుల్లో 50) హాఫ్‌ సెంచరీ చేయగా.. కామెరాన్‌ గ్రీన్‌(20 బంతుల్లో 37 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్‌రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్‌దే.

ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్‌రైజర్స్‌ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్‌ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.

ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్‌ వరకు బ్యాటింగ్‌ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్‌రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్‌ క్లాస్‌ ప్లేయర్‌నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆశించదు’’ అని సునిల్‌ గావస్కర్‌ స్టార్‌ స్ట్పోర్స్‌ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్‌ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్‌ పాటిదార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement