‘రచ్చ’ గెలిచారు
►ప్రత్యర్థి వేదికపై సన్‌రైజర్స్ తొలి విజయం
►26 పరుగులతో పంజాబ్ చిత్తు
►ధావన్, విలియమ్సన్, వార్నర్ అర్ధ సెంచరీలు
బ్యాటింగ్‌లో టాప్–3 ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడుతూ అర్ధ సెంచరీలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేస్తే... బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన సన్‌రైజర్స్‌కు మరో కీలక విజయాన్ని అందించింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సంపూర్ణ ఆధిక్యంతో వరుసగా గెలిచినా, ప్రత్యర్థి వేదికపై బోణీ చేయలేకపోయిన హైదరాబాద్... ఇప్పుడు పంజాబ్ గడ్డపై ఆ లోటును పూరించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వార్నర్ సేన, కింగ్స్ ఎలెవన్‌పై ‘రివర్స్’ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. బౌలింగ్ వైఫల్యంతో ముందే చేతులెత్తేసిన పంజాబ్‌ను భారీ ఛేదనలో మార్‡్ష ఇన్నింగ్స్ ఆదుకోలేకపోయింది.
మొహాలీ: భారీ స్కోరు చేసి కూడా పుణేతో గత మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 26 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (48 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (27 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఒక ఇన్నింగ్స్‌లో టాప్–3 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఐపీఎల్‌లో ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేయగలిగింది. షాన్ మార్ష్(50 బంతుల్లో 84; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా అతనికి మరో వైపునుంచి సహకారం అందలేదు. పొదుపుగా బౌలింగ్ చేసిన రషీద్‌ఖాన్ (1/16)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఒకరిని మించి మరొకరు...
తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో శుభారంభం చేసినట్లుగా పంజాబ్ భావించింది! అయితే అది అక్కడితో సరి... రెండో ఓవర్ నుంచి సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగి పరుగుల వరద పారించారు. తర్వాతి ఎనిమిది ఓవర్ల పాటు ఆ విధ్వంసం సాగింది. 2–9 ఓవర్ల మధ్య రైజర్స్ 12 రన్‌రేట్‌తో ఏకంగా 96 పరుగులు స్కోరు చేసింది. అనురీత్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో ధావన్ ధాటిని ప్రదర్శించగా, అక్షర్ తొలి ఓవర్లో వార్నర్ వరుస బంతుల్లో 4, 6, 4 బాదాడు. అయితే తర్వాతి బంతికి కీపర్ సాహా క్యాచ్ వదిలేయడంతో హైదరాబాద్ కెప్టెన్‌కు మరో అవకాశం దక్కింది.
అనురీత్ మరో ఓవర్లో మూడు ఫోర్లు సహా రైజర్స్ 16 పరుగులు రాబట్టింది. పదో ఓవర్లో తొలి రెండు బంతులకు వార్నర్, ధావన్‌లు తమ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. పంజాబ్ జట్టుపై వార్నర్‌కు ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఎట్టకేలకు వార్నర్‌ను బౌల్డ్ చేసి మ్యాక్స్‌వెల్ ఈ జోడీని విడదీయగా... తర్వాతి 17 బంతుల్లో సన్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరగ్గా... యువరాజ్ (12 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే విలియమ్సన్ మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇషాంత్ వేసిన 19వ ఓవర్లో అతను దూకుడు ప్రదర్శించాడు. రెండు ఫోర్లు, సిక్స్ సహా ఒక్కడే 20 పరుగులు సాధించాడు.
‘షాన్’దార్ ఆట...
సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న గప్టిల్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) పంజాబ్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. అయితే చక్కటి బంతితో భువనేశ్వర్ అతని జోరుకు బ్రేక్ వేయగా, వోహ్రా (3) విఫలమయ్యాడు. కౌల్ తన తొలి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్ (0)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో మార్‡్ష ధాటిగా ఆడి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. నెహ్రా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత హుడా ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ సాహా 17 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 59 పరుగులు చేయగలిగింది. అయితే రషీద్ తన తొలి 2 ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి పంజాబ్‌ను పూర్తిగా కట్టిపడేశాడు. అయితే మార్‡్ష, మోర్గాన్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి మళ్లీ పంజాబ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. హెన్రిక్స్ వేసిన ఓవర్లో వీరిద్దరు మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో 19 పరుగులు కొల్లగొట్టారు. కౌల్ ఓవర్లో కూడా వరుసగా 4, 6, 4 కొట్టి దూకుడు పెంచిన మార్‡్షను భువీ అవుట్ చేయడంతో విజయంపై కింగ్స్ ఆశలు వదిలేసుకుంది.
ఐపీఎల్‌లో నేడు
రైజింగ్ పుణే & బెంగళూరు
వేదిక: పుణే; సా. గం. 4.00 నుంచి
గుజరాత్& ముంబై
వేదిక: రాజ్‌కోట్; రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం