విజయం కోసం.. | Sunrisers Hyderabad today faced to Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

విజయం కోసం..

Published Sat, Apr 15 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

విజయం కోసం..

విజయం కోసం..

నేడు కోల్‌కతాను ఢీకొననున్న హైదరబాద్‌
ఒత్తిడిలో సన్‌రైజర్స్‌ 

ఉత్సాహంలో నైట్‌రైడర్స్‌

కోల్‌కతా: డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. రెండుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది. వరుసగా రెండు విజయాలు సాధించి జోరు కనబర్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో షాక్‌ ఎదురైంది. దీంతో తిరిగి విజయాల బాట పట్టాలని రైజర్స్‌ ఆశిస్తోంది. మరోవైపు పంజాబ్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి నెగ్గింది. ఈ విజయాల జోరును ఇలా కొనసాగాలని జట్టు భావిస్తోంది.

మిడిలార్డర్‌ వైఫల్యం..
టోర్నీలో రెండు వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించిన సన్‌రైజర్స్‌.. ముంబై ఇండియన్స్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్, శిఖర్‌ ధావన్‌ రాణించి శుభారంభాన్నిచ్చారు. అయితే మిడిలార్డర్‌ వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ప్రధానంగా వార్నర్‌పైనే ఆధారపడుతోంది. డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. అతనితోపాటు మిగతా బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటాల్సి ఉంది. ఈక్రమంలో ఆల్‌రౌండర్‌ బెన్‌ కట్టింగ్‌పై వేటు తప్పకపోవచ్చు. అతని స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ఆఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ సత్తా చాటుతున్నాడు. పేసర్లలో భువనేశ్వర్‌ కుమార్, ఆశిష్‌ నెహ్రా ఆకట్టుకుంటున్నారు.

అయితే బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ విఫలమయ్యాడు. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని ముస్తాఫిజుర్‌.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో తాను విసిరిన తొలి ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా తను గాడిలో పడాలని జట్టు భావిస్తోంది. మ్యాచ్‌లో మంచు కూడా జట్టు ఫలితంపై ప్రభావం చూపించింది. మరోవైపు కోల్‌కతాతో ముఖాముఖిపోరులో 3–6తో వెనుకబడిన సన్‌రైజర్స్‌.. తమ రికార్డును మెరుగుపర్చుకోవడంతోపాటు విజయాల బాట పట్టాలని భావిస్తోంది.

సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. హైదరాబాద్‌తో మరో పోరుకు సిద్ధమైంది. ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయాక జట్టు తిరిగి పుంజుకుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో సమష్టి విజయం నమోదు చేసింది. ముఖ్యంగా జట్టుతో చేరిన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ సత్తాచాటాడు. ఆడిన తొలిమ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను కొల్లగొట్టాడు. దీంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న పంజాబ్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. క్రిస్‌ వోక్స్‌ ఆకట్టుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ కోల్‌కతా జాదూ చేసింది. సునీల్‌ నరైన్‌ (18 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఓపెనర్‌గా పంపి విజయవంతమైంది.

గతంలో ఓపెనింగ్‌ చేసిన అనుభవమున్న నరైన్‌ సానుకూల ఫలితం పొందింది. దీంతో గాయంతో జట్టుకు దూరమైన క్రిస్‌ లిన్‌ స్థానంలో నరైన్‌ మరికొన్ని మ్యాచ్‌లకు ప్రయత్నించవచ్చు. మరోవైపు కెప్టెన్‌ గౌతం గంభీర్‌ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 33వ ఐపీఎల్‌ ఫిఫ్టీని నమోదు చేశాడు. తను చివరికంటా క్రీజ్‌లో నిలవడంతోపాటు జట్టు బ్యాటింగ్‌లో కూడా సమష్టిగా రాణించింది. దీంతో సొంతగడ్డపై వరుసగా 11వ ఛేదనను పూర్తి చేసుకుంది. 2012లో ప్రారంభమైన ఈ విజయయాత్ర ఈ సీజన్‌లోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. దీంతో ఈ విజయాల జోరును ఇలా కొనసాగించాలని కోల్‌కతా కృత నిశ్చయంతో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement