విజయానంతరం భువనేశ్వర్‌తో సన్‌రైజర్స్ సహచరుల సంబరం
లీగ్‌లో... సన్‌రైజర్స్ ఎంతచేసినా గెలిచేలా ఉంది...! రాయల్ చాలెంజర్స్ ఏం చేసినా గెలిచేలా లేదు..! పరుగుల వరద పారే ఐపీఎల్‌లో తక్కువ స్కోర్లతో తమకు ఉన్న బంధాన్ని సన్‌రైజర్స్ మళ్లీ ప్రదర్శించింది. 146 పరుగులు చేసి కూడా ఆ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. తమకు అలవాటైన రీతిలో మరోసారి సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని వరుసగా ఐదో విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేయగా... బ్యాటింగ్ బలగం మళ్లీ ముంచడంతో ఓటమి పాలైన బెంగళూరు దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్లే.
18 బంతుల్లో 25 పరుగులు, చేతిలో 5 వికెట్లు... ఐపీఎల్ ప్రమాణాలపరంగా చూస్తే ఇది సునాయాసంగా చేయాల్సిన స్కోరు. కానీ బెంగళూరు చేతులెత్తేసింది. ఒకే బౌండరీతో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ కలిసి ప్రత్యర్థిని కట్టిపడేయడంతో ఆర్‌సీబీకి మరో ఓటమి తప్పలేదు.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, షకీబ్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. సిరాజ్, సౌతీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లి (30 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (29 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం...
తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన సన్‌రైజర్స్‌ను మూడో ఓవర్లో సౌతీ దెబ్బ తీశాడు. అతను వేసిన చక్కటి బంతికి హేల్స్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో సన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం సిరాజ్ కూడా తొలి ఓవర్లోనే ధావన్ (13)ను వెనక్కి పంపాడు. మనీశ్ పాండే (5) తన వైఫల్యాన్ని కొనసాగించడంతో హైదరాబాద్ స్కోరు 3 వికెట్లకు 48 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో విలియమ్సన్, షకీబ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసినా... బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల వేగం మందగించింది. ఎట్టకేలకు ఐదు బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి విలియమ్సన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఉమేశ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్ అవుట్ కావడంతో మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కేన్, షకీబ్ 47 బంతుల్లో 64 పరుగులు జోడించారు. మరికొద్ది సేపటికే షకీబ్‌ను సౌతీ వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతా వరుస పెట్టి విఫలం కావడంతో రైజర్స్ భారీ స్కోరు సాధించలేకపోయింది. 22 పరుగుల వ్యవధిలో హైదరాబాద్ చివరి 6 వికెట్లు పడ్డాయి. 19వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 20వ ఓవర్లో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇందులో కోహ్లి చేసిన రెండు రనౌట్‌లు ఉన్నాయి. తొలి 10 ఓవర్లలో 61 పరుగులు చేసిన హైదరాబాద్, తర్వాతి పది ఓవర్లలో 85 పరుగులు రాబట్టింది. సీజన్‌లో రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే రెండో సారి.
కోహ్లి మినహా...
సాధారణ లక్ష్య ఛేదనలో కోహ్లి ఉన్నంత సేపు మినహా బెంగళూరు ఆట తడబడుతూనే సాగింది. భువనేశ్వర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పార్థివ్ పటేల్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), షకీబ్ వేసిన ఓవర్లోనూ వరుసగా మరో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. షకీబ్ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. అయితే రైజర్స్ అద్భుతమైన బౌలింగ్ ముందు ఇది ఎంతో సేపు సాగలేదు. 28 బంతుల వ్యవధిలో 24 పరుగులు మాత్రమే చేసిన ఆర్‌సీబీ 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. వోహ్రా (8)ను సందీప్ శర్మ బౌల్డ్ చేయగా, యూసుఫ్ పఠాన్ గాల్లో ఎగిరి ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. రషీద్ గుగ్లీని డివిలియర్స్ (5) వికెట్ల పైకి ఆడుకోగా... తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన మొయిన్ అలీ (10)ని కౌల్ అవుట్ చేశాడు. ఈ దశలో మన్‌దీప్, గ్రాండ్‌హోమ్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరు 50 బంతుల్లో 57 పరుగులు జోడించినా లాభం లేకపోయింది.
సిరాజ్ జోరు...
హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ సొంతగడ్డపై సత్తా చాటాడు. గత ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను... ఈసారి బెంగళూరు తరఫున రైజర్స్‌పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 25 పరుగులకే 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో సిరాజ్ భారీగా పరుగులు ఇచ్చేశాడు. వికెట్ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. నాలుగో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసినా, అది జట్టు విజయానికి పనికి రాలేదు. అయినా సరే సిరాజ్‌పై కెప్టెన్ కోహ్లి నమ్మకముంచాడు. ముంబైతో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించడంతో అతనికి మళ్లీ అవకాశాలు దక్కాయి. సోమవారం మ్యాచ్‌లో తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ చక్కటి బంతితో ధావన్‌ను అవుట్ చేశాడు. అతని రెండో ఓవర్లో కూడా 4 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో షకీబ్ రెండు ఫోర్లు కొట్టినా... ఆఖరి ఓవర్లో రెండు వికెట్లతో అతను సత్తా చాటాడు. తొలి బంతికి యూసుఫ్ పఠాన్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహాలను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో సాహాకు వేసిన బంతి ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో దూసుకు రావడం సిరాజ్ సత్తాకు నిదర్శనం. 2017లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసిన సిరాజ్‌కు ఈసారి ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం లభించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కూడా అతడిని ఆర్‌సీబీ ఆడిస్తే అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు. దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లడంతో బెంగళూరు మిగతా మ్యాచ్‌ల్లో ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశముంది. ఫలితంగా సిరాజ్‌కు మరిన్ని అవకాశాలు లభించే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment