కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
హైదరాబాద్: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌పై సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ భారీ విజయం నమోదు చేసింది. ముంబై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్ శిఖర్ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్), హెన్రిక్స్(44 పరుగులు) సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బౌలర్లలో మలింగ, బుమ్రా, క్లెనగన్‌లకు తలో వికెట్ దక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ ఆది నుంచి తడబడింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమన్స్(1), నితీశ్ రానా(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరువాత పార్ధీవ్ పటేల్ (23) కూడా కొద్ది వ్యవధిలోనే వికెట్ కోల్పోవడంతో ముంబై 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 60 పరుగులు జత చేయడంతో ముంబై కాస్త కుదుటపడింది. కాగా, హార్దిక్ పాండ్యా(15) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఆపై రోహిత్ -పొలార్డ్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా రోహిత్ శర్మ(67;45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటైన తరువాత పొలార్డ్(5), కరణ్ శర్మ(5)లు కూడా నిష్క్రమించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ ఆకట్టుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు కీలక వికెట్లను సాధించాడు.