సూపర్... ఫెడరర్
మెల్‌బోర్న్: పదునైన సర్వీస్‌లు... పాదరసంలాంటి కదలికలు... ఆత్మవిశ్వాసం నిండిన ఆటతీరు... సులువుగా నెగ్గాల్సిన పాయింట్లు కోల్పోయినా చెదరని ఏకాగ్రత... ఏదైతేనేం స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మళ్లీ మెరిపిస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్వితీయ ఆటతీరును కనబరుస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా 11వ ఏడాది సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఫెడరర్ 6-3, 6-4, 6-7 (6/8), 6-3తో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు. గతేడాది ఇదే టోర్నీలో ఐదు సెట్‌లపాటు జరిగిన సెమీఫైనల్లో ముర్రే చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి బదులు తీర్చుకున్నాడు. ముర్రేతో 3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 10 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్‌వద్దకు 66 సార్లు వచ్చి 49 సార్లు పాయింట్లు నెగ్గాడు.
నాదల్‌తో అమీతుమీ
శుక్రవారం జరిగే సెమీఫైనల్లో నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 22-10తో ఫెడరర్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండుసార్లు (2012 సెమీఫైనల్, 2009 ఫైనల్) తలపడ్డారు. రెండుసార్లూ నాదలే గెలిచాడు. మూడోసారైనా ఫెడరర్‌ను విజయం వరిస్తుందో లేదో వేచి చూడాలి.
శ్రమించిన టాప్ సీడ్
మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ 3-6, 7-6 (7/3), 7-6 (9/7), 6-2తో 22వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నీలో తొలిసారి సెట్‌ను కోల్పోయిన నాదల్ మూడో సెట్‌లోని టైబ్రేక్‌లో దిమిత్రోవ్ చేసిన అనవసర తప్పిదాలతో లబ్ధి పొందాడు. నాలుగో సెట్‌లో దిమిత్రోవ్ తడబడటంతో నాదల్ గట్టెక్కాడు.
పేస్ జోడికి షాక్
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 2-6, 6-7 (4/7)తో 13వ సీడ్ లోద్రా- మహుట్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) 5-7, 3-6తో గజ్దోసోవా-ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి చేతిలో ఓడింది.
నేటి కీలక మ్యాచ్‌లు
మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
నా లీ (4)Xబౌచర్డ్ (30)
రద్వాన్‌స్కా (5)Xసిబుల్కోవా (20)
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్
బెర్డిచ్ (7) గీ వావ్రింకా (8)
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్