భారత మహిళల జోరు
‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం
మెరిసిన మిథాలీ రాజ్, మోనా
కొలంబో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... ‘సూపర్ సిక్స్’ దశను కూడా విజయంతో మొదలుపెట్టింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో టీమిండియా తమ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం 49 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 205 పరుగులు సాధించింది. మోనా మేష్రమ్ (85 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (85 బంతుల్లో 64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతోపాటు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. మిథాలీ, మోనా పెవిలియన్ చేరుకున్నాక... బ్యాట్స్‌విమెన్ వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 18; ఒక ఫోర్, ఒక సిక్స్), దేవిక వైద్య (21 బంతుల్లో 19; 2 ఫోర్లు), శిఖా పాండే (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా అవుటయ్యారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజెన్ కాప్, అయబోంగా ఖాక రెండేసి వికెట్లు పడగొట్టారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. శిఖా పాండే (4/34), ఏక్తా బిష్త్ (3/22) దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ లభించింది. మిథాలీ రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఇతర సూపర్ సిక్స్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్లతో ఐర్లాండ్‌పై, శ్రీలంక 5 వికెట్లతో పాకిస్తాన్‌పై గెలిచాయి. శుక్రవారం జరిగే తమ రెండో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది.