మరో 11 రోజుల్లో తేలనున్నలలిత్ మోడీ భవితవ్యం
జైపూర్ : రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆర్సీఏ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన లలిత్ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్ చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు లలిత్ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు.
రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్‌లో ఉన్న వెసులుబాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రూంగ్టా రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్‌ని సవాల్ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్‌ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్ వర్గం హెచ్చరించింది. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే అవకాశాలు వున్నాయి.