70 ఏళ్ల వరకూ ఎందుకు?
ఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో, దాని అనుబంధ రాష్ట్ర సంఘాల్లో 70 ఏళ్ల పైబడిన వారు సభ్యులు కాకూడదన్న జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదనను అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు 70 ఏళ్లు, ఆపై ఉన్న వారు బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. అరవై ఏళ్ల తరువాత కచ్చితంగా వారు ఆయా పదవులు నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. బోర్డులో వయసు నిబంధన ఎంత ఉండాలో మీరైనా చెప్పాలంటూ బీసీసీఐని సుప్రీం ఆదేశించింది. జస్టిస్ లోథా సూచించిన ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన అఫిడవిట్పై విచారిస్తున్న సుప్రీం తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.
ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో లోథా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డబ్భై ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదని సూచిండంతో పాటు, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు మాత్రమే ఉండాలని లోథా కమిటీ ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే ఉండాలని పేర్కొంది.
ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలని, అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలని సూచించింది. ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదని,బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తేవాలని తదితర ప్రతిపాదనలను లోథా కమిటీ ప్రతిపాదించింది. వీటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బీసీసీఐ గత నెల్లో అఫిడవిట్ దాఖలు చేసింది.