మళ్లీ ముద్గల్ కమిటీనే విచారణ చేయమని కోరిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: బీసీసీఐ చర్యలపై సుప్రీం కోర్టుకు ఏ కోశానా నమ్మకం కుదిరే ట్టు కనిపించడం లేదు. గతేడాది ఐపీఎల్‌లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం అనుమానితులపై విచారణ కోసం ఓ కమిటీని నియమించాలని గతంలో బోర్డును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో ముగ్గురు సభ్యుల (రవిశాస్త్రి, సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్, మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్)తో కూడిన ప్యానెల్‌ను బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. కానీ సుప్రీం కోర్టు ఆ కమిటీని తేలిగ్గా తీసుకుంది. ఇప్పటికే సభ్యులపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దీంతో ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ వైపే కోర్టు మొగ్గు చూపింది.
ఎన్.శ్రీనివాసన్ మరో 12 మంది పాత్ర గురించి విచారణ జరిపే బాధ్యతను తీసుకుంటారా? అని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ముద్గల్ కమిటీని అడిగింది. ఒకవేళ కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందిస్తే వారికి సహాయకంగా పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలోని ఆడియో రికార్డులో కొంత భాగాన్ని వినేందుకు బీసీసీఐ, శ్రీనివాసన్‌లకు కోర్టు అనుమతించింది. అయితే ఇందులోని విషయాలను ఎక్కడా బహిర్గతపరచవద్దని ఆదేశించింది.
మేం సిద్ధం: ముద్గల్ కమిటీ
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లో అనుమానితులుగా ఉన్న వారిపై విచారణ జరిపేందుకు తాము సిద్ధమేనని ముద్గల్ కమిటీ స్పష్టం చేసింది. ‘ఇప్పటికే కోర్టుకు మా అంగీకారం తెలిపాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు. కోర్టు ఆదేశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని ముద్గల్ అన్నారు. ఈనెల 29న జరిగే విచారణలో కమిటీని కోర్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
బీసీసీఐ కమిటీని తిరస్కరించిన సుప్రీం
Published Wed, Apr 23 2014 12:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement