
సురేశ్ రైనాకు తప్పిన ప్రమాదం
కాన్పూర్: భారత క్రికెటర్ సురేశ్ రైనా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘజియాబాద్ నుంచి కాన్పూర్ కు వెళుతున్న సమయంలో రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ ఎస్యూఏ కారు టైరు పేలిపోయింది. దాంతో కొద్దిపాటి కుదుపుకు గురైన కారు అదుపు తప్పింది. కాగా, ఆ సమయంలో కారును రైనా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.
దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సారథిగా రైనా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం కాన్పూర్ కు కారులో బయల్దేరగా ఎత్వాలోని ఫ్రెండ్స్ కాలనీ వద్ద టైరు పేలిపోయింది. అయితే కారులో మరొక టైరు లేకపోవడంతో రైనా మరొక వెహికల్ వచ్చే వరకూ అక్కడ నిరీక్షించాల్సి వచ్చింది. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైనాకు వేరే కారును ఏర్పాటు చేశారు.