ధోని, రైనాలు సిద్ధం..కానీ!
న్యూఢిల్లీ:శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత వన్డే జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు సురేశ్ రైనాలు పూర్తి ఫిట్ నెస్ ను సాధించి వన్డే సిరీస్ కు సిద్దమయ్యారు. దీనిలో భాగంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ అనంతరం సహచరులతో కలిసి దిగిన ఫోటోను ధోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. 'ఎన్సీఏ అన్ని పరీక్షలు అయిపోయాయి. 20 మీటర్ల పరుగును 2.91సెక్లన్లలో ముగించాను. ఇక భారీ భోజనానికి సమయం అయ్యింది'అని ధోని పేర్కొన్నాడు.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత భారత ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోనికి కచ్చితంగా స్థానం ఉంటుంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కు కూడా ధోని బెర్తు ఖాయం. కాగా, గత కొంత కాలంగా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సురేశ్ రైనా ఈసారి భారీ ఆశలతో ఉన్నాడు. కచ్చితంగా టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందనే భరోసాతో ఉన్నాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో రైనా చివరిసారి కనిపించాడు. మరి రేపు జరిగే భారత జట్టు సెలక్షన్లో రైనాకు స్థానం దక్కుతుందో లేదో చూడాలి. ఇదే సమయంలో జడేజా, అశ్విన్, మహ్మద్ షమీలకు వన్డే సిరీస్ కు విశ్రాంతినివ్వాలని సెలక్షన్ కమిటీ యోచిస్తోంది.