సురేష్ రైనా అజేయ సెంచరీ
కాన్పూర్: రంజీ ట్రోఫీ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు, ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ సురేష్ రైనా అజేయ సెంచరీతో అదరగొట్టాడు. గ్రూప్ బి-లో భాగంగా ఇక్కడ తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ లో రైనా (145 ;138 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) దూకుడుగా ఆడి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో రైనా(61) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్ లో తమిళనాడు బౌలర్లకు చుక్కలు చూపించి భారీ సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్ ఆల్మాస్ షాకూత్(75) కూడా రాణించడంతో యూపీ తన రెండో ఇన్నింగ్స్ ను 273/5 వద్ద డిక్లేర్ చేసింది.
అంతకుముందు 174/6 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన తమిళనాడు 231 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు ఆటగాళ్లలో విజయ్ శంకర్(92), ఇంద్రజిత్(44), రంగరాజన్ (45)లు రాణించగా,ప్రసన్న(32) ఫర్వాలేదనిపించాడు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ కు ఓవరాల్ గా 391 ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన తమిళనాడు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. అభివన్ ముకుంద్(3 బ్యాటింగ్), అపరాజిత్(0 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. తమిళనాడు విజయం సాధించాలంటే 386 పరుగులు అవసరం. ఇంకా ఆటకు ఒక రోజు మిగిలి ఉండటంతో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
యూపీ తొలి ఇన్నింగ్స్ 348 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 273/5 డిక్లేర్
తమిళనాడు తొలి ఇన్నింగ్స్ 231 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 5/0