చరిత్రలో నిలిచే విజయాలతో లభించిన రెండు స్వర్ణాలు... అరుదైన రికార్డుతో దక్కిన రజతం... నిలకడైన ప్రదర్శనకు అందిన కాంస్యంతో ఆసియా క్రీడల 11వ రోజు భారత్... నాలుగు పతకాలు సాధించింది. 11 స్వర్ణాలతో గత ఏషియాడ్ రికార్డు సమం చేసిన మన దేశం... ప్రస్తుతం మొత్తం 54 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ స్వర్ణ స్వప్నం సాకారం చేయడం... ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ అదరగొట్టడం ఏషియాడ్‌లో బుధవారం భారత్ తరఫున నమోదైన మెరుపులు...! ద్యుతీ చంద్ రెండో పతకంతో సత్తా చాటగా...టీటీలో మరో కాంస్యంతో మిక్స్‌డ్ ద్వయం ఆనందం నింపింది.
జకార్తా: కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారం... 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనత... గతంలో మూడుసార్లు ఊరించి చేజారిన కల... ఇప్పుడు మాత్రం నెరవేరింది. అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ దానిని సాధించింది. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది.
ఏడు క్రీడాంశాల్లో ఇలా...
రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్‌లో ఏడు క్రీడాంశాల్లో స్వప్న మొత్తం 6,026 పాయింట్లు సాధించింది. హై జంప్ (1.82 మీ.), జావెలిన్ త్రో (50.63 మీ.)లలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్ (12.69 మీ.), లాంగ్ జంప్ (6.05 మీ.)లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులో 13.98 సెకన్లతో నాలుగో స్థానంలో, 200మీ. పరుగులో 26.08 సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... అందులో (2ని.21:13సె.) నాలుగో స్థానంలో నిలిచినా... మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. చైనాకు చెందిన క్వింగ్‌లింగ్ వాంగ్ (5954 పాయింట్లు) రజతం, జపాన్ అథ్లెట్ యమసాకి యుకి (5873 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. అయితే, 800 మీ. పరుగుకు ముందు యమసాకి కంటే 18 పాయింట్లు మాత్రమే వెనుకబడిన భారత అథ్లెట్ పూర్ణిమా హెంబ్రామ్ (5837 పాయింట్లు)... ఆ రేసులో మూడో స్థానంలో నిలిచినా ఓవరాల్ స్కోరులో వెనుకబడి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. మరోవైపు ఏషియాడ్ హెప్టాథ్లాన్‌లో భారత్ తరఫున సోమా బిశ్వాస్ (2002, 2006) రజతం నెగ్గడమే ఇప్పటివరకు అత్యుత్తమం. జేజే శోభా (2002, 2006), ప్రమీలా అయ్యప్ప (2010)లు కాంస్యాలు గెలిచారు.
ఆరు వేళ్ల బర్మన్... ఏడు ఈవెంట్ల విన్నర్
రెండు కాళ్లకు ఆరు వేళ్లుంటే నడవొచ్చు. పరిగెత్తొచ్చు. అంతేకాదు పతకం కూడా గెలవొచ్చని ఏషియాడ్‌లో ఘనంగా చాటింది స్వప్న బర్మన్. ఇది కూడా ఓ ఘనతేనా అనుకుంటే ఒక అథ్లెట్ శ్రమను తక్కువగా అంచనా వేసినట్లే! ఎందుకంటే ఆరేసి వేళ్లున్న అమ్మాయి అయినా అబ్బాయైనా షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్‌కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. సాధించడంపైనే మక్కువ పెంచుకుంది. చివరకు ఇంచియోన్ (గత ఏషియాడ్‌లో ఐదోస్థానం)లో పోగొట్టుకున్న పతకాన్ని జకార్తాలో చేజిక్కించుకునేలా తయారు చేసింది.
నాడు కష్టాలతో సహవాసం... నేడు పసిడితో సాకారం...
బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. కడుపునిండా తినడానికే పోరాడాల్సిన ఇంట్లో పతకం కోసం ఆరాటపడటం అత్యాశే అని అనిపిస్తుంది! కానీ... స్వప్న కేవలం ఆరాటంతోనే గడిపేయలేదు. దినదిన పోరాటంతో కుంగిపోలేదు. ఓ లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం చేసింది. చివరికి ఈ పయనంలో విజేతగా నిలిచింది. ఒకటి కాదు... రెండు కాదు... ఏడు. హైజంప్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, 100 మీ. 200 మీ. 800 మీ. పరుగు పోటీలు. ఇవన్నీ ఓ ‘పట్టు’పడితే ముగిసే రెజ్లింగ్ పోటీలు కాదు. ధనాధన్‌గా బాదే క్రికెట్ మెరుపులు కాదు. ఒక్కో ఈవెంట్ ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అన్నీ భిన్న మైనవే! అన్నీ కష్టమైనవే! కానీ ఇవన్నీ స్వప్నకు సలాం చేశాయి.
పొట్టిగా ఉన్నావంటే... గట్టిగా బదులిచ్చింది...
స్వప్న హెప్టాథ్లాన్‌కు హైజంప్‌తో బీజం పడింది. తన సోదరుడు దూకే ఎత్తును చూసి తాను దూకేందుకు సరదా చూపెట్టింది. 2011లో 1.20 మీ. నుంచి 1.30 మీటర్ల ఎత్తు వరకూ దూకింది. శిక్షణ కేంద్రంలో మిగతావారు వివిధ ఈవెంట్లలో ఆడటం చూసి క్రమంగా హెప్టాథ్లాన్ ప్లేయర్‌గా ఎదిగింది. ఈ చాన్స్ కూడా అంత ఈజీగా రాలేదు. ముందుగా శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. సాయ్‌లో శిక్షణకు సీటొచ్చింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత చూస్తే ఆమె 66 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచింది. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సిద్ధమైతున్న వేళ కూడా బర్మన్‌ను పంటినొప్పి తీవ్రంగా బాధపెట్టింది. అయితే యాంటిబయోటిక్స్ మందులతో బరిలోకి దిగి అనుకున్నది సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment