న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే టోర్నీ, రంజీ ట్రోఫీ తర్వాత 2018–19 సీజన్‌లో మూడో ఫార్మాట్ దేశవాళీ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి వేర్వేరు వేదికల్లో టి20 టోర్నమెంట్ ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 14న ఫైనల్ నిర్వహిస్తారు. గత కొన్నేళ్లుగా కుర్రాళ్లు సత్తా చాటి ఐపీఎల్‌లో అవకాశం దక్కేందుకు ఈ టోర్నీ వేదికగా ఉపయోగపడింది. దాని కోసమే ఐపీఎల్ వేలానికి ముందే బీసీసీఐ దీనిని నిర్వహించేది. ఇప్పటికే 2019 ఐపీఎల్ వేలం ముగిసిపోయిన నేపథ్యంలో ఈ సారి టోర్నీకి ప్రాధాన్యత కొంత తగ్గింది. అయితే కొత్త ఆటగాళ్లు, సీనియర్లతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లతో ఉన్నవారు ధనాధన్ ఆటలో తమ సత్తాను పరీక్షించుకునేందుకు కూడా ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది.
గత ఏడాది 28 జట్లు బరిలోకి దిగగా... ఈశాన్య రాష్ట్రాలు జత చేరడంతో మొత్తం టీమ్‌ల సంఖ్య 37కు చేరింది. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, చతేశ్వర్ పుజారా, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, విజయ్ శంకర్, సురేశ్ రైనా బరిలోకి దిగుతుండటం విశేషం. సీనియర్లు అజింక్య రహానే (ముంబై), రవిచంద్రన్ అశ్విన్ (తమిళనాడు), హర్భజన్ సింగ్ (పంజాబ్), ఇషాంత్ శర్మ (ఢిల్లీ), అంబటి రాయుడు (హైదరాబాద్), హనుమ విహారి (ఆంధ్ర), మనీశ్ పాండే (కర్ణాటక) తమ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికాలో గాయపడి కోలుకున్న అనంతరం వికెట్ కీపర్ సాహా తొలిసారి మైదానంలోకి దిగుతుండగా... గాయంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగిన పృథ్వీ షా కూడా ఆడుతున్నాడు.
టోర్నీ విశేషాలు...
మొత్తం జట్లు 37
మొత్తం మ్యాచ్‌లు 140
ఫార్మాట్: టీమ్‌లను 5 గ్రూప్‌లుగా విభజించారు. మూడు గ్రూప్‌లలో 7 చొప్పున, మరో రెండు గ్రూప్‌లలో 8 చొప్పున జట్లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన రెండు జట్లు ముందుకు వెళతాయి. ఈ పది జట్లతో జరిగే ‘సూపర్ లీగ్’లో కూడా రెండు గ్రూప్‌లు ఉంటా యి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
వివరాలు
గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, జమ్ము కశ్మీర్, కేరళ, ఢిల్లీ (ఈ గ్రూప్‌లో మ్యాచ్‌లకు విజయవాడ మూలపాడు మైదానం వేదిక).
గ్రూప్ ‘బి’: హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, విదర్భ, గుజరాత్, బిహార్, రాజస్థాన్, మేఘాలయ (వేదిక సూరత్).
గ్రూప్ ‘సి’: రైల్వేస్, సిక్కిం, సౌరాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్, గోవా, ముంబై (వేదిక ఇండోర్).
గ్రూప్ ‘డి’: ఒడిషా, బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, అస్సాం, హర్యానా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక (వేదిక కటక్).
గ్రూప్ ‘ఇ’: హైదరాబాద్, త్రిపుర, పుదుచ్చేరి, మహారాష్ట్ర, బరోడా, సర్వీసెస్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ (వేదిక ఢిల్లీ).
- ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment