మామూలుగానే బంగ్లాదేశ్‌లో భారత్‌ను మించిన క్రికెట్ పిచ్చి. అలాంటిచోట టి20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ జరిగితే కావలసినంత సందడి, ఉత్సాహం.
ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మామూలుగానే బంగ్లాదేశ్‌లో భారత్‌ను మించిన క్రికెట్ పిచ్చి. అలాంటిచోట టి20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ జరిగితే కావలసినంత సందడి, ఉత్సాహం. ఢాకా మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. నగరం అంతా రోడ్లను రంగు లైట్లతో అలంకరించారు. ప్రధాన రోడ్లన్నింటిపై ‘బంగ్లాదేశ్‌కు స్వాగతం’ అంటూ షకీబ్ బొమ్మతో ఉన్న కటౌట్లు పెట్టారు. రిక్షా వాలా నుంచి ప్రధాన మంత్రి దాకా అందరి ధ్యాసా ప్రస్తుతం ప్రపంచకప్ మీదే ఉంది. రోడ్లపై భారీ స్క్రీన్లు... కార్లలో, ఆటోల్లో రేడియో కామెంటరీ... మొత్తానికి భారత్‌లో కూడా ఇలాంటి సందడి ఉండదేమో!
ఇంగ్లిష్ క్రికెటర్... అరబిక్ టాటూ
మిర్పూర్: ఇంగ్లిష్ క్రికెటర్ అరబిక్ అక్షరమాలతో టాటూ ముద్రించుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ తన టాటూ ముచ్చటను పరభాషతో తీర్చుకున్నాడు. తన కుడి మణికట్టుపై చక్కగా కనిపించేలా ముద్రించుకున్న భాష ఏంటో అందరికీ అర్థం కాదు సుమా! ఎందుకంటే అతను అరబిక్ భాషలో వేసుకున్నాడు. దాని అర్థం ‘ధైర్యం’ (కరేజ్) అని ముచ్చటగా చెప్పుకొచ్చాడు హేల్స్. పెద్ద పెద్ద టాటూలు వేసుకోవడంలో భారత క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. చేతుల నిండా శిఖర్ ధావన్, కోహ్లిలు ముద్రించుకున్న టాటూలు ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.