'క్రికెటర్ల ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యత'
కడప:భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఎంపిక విషయంలో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తానని జాతీయ జట్టు సెలెక్టర్ గా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రసాద్ కు సెలెక్టర్ల జాబితాలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ ను వైఎస్ రాజారెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్మానించారు. అనంతరం ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయన్నాడు. జట్టు ఎంపికలో ఆటగాళ్ల ప్రతిభకే తాను పెద్ద పీట వేస్తానని తెలిపాడు.
ఈరోజు జరిగిన ఏజీఎం సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు.