హైదరా‘బ్యాడ్’ హంటర్స్
సాక్షి, హైదరాబాద్: కీలక మ్యాచ్‌ల్లో తడబాటు కారణంగా హైదరాబాద్ హంటర్స్ జట్టుకు సొంతగడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు 3-4 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ లీగ్‌లో హంటర్స్ జట్టుకిది ఓవరాల్‌గా మూడో పరాజయం. ప్రస్తుతం హంటర్స్ 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా... 12 పాయింట్లతో చెన్నై మూడో స్థానంలో ఉంది.
తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోటీలో కార్‌స్టెన్ మొగెన్‌సన్-గుత్తా జ్వాల (హైదరాబాద్) ద్వయం 7-15, 7-15తో క్రిస్ అడ్‌కాక్-పియా జెబాదియా (చెన్నై) జోడీ చేతిలో ఓడిపోయింది.
అయితే పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లీ చోంగ్ వీ (హైదరాబాద్) 15-3, 12-15, 15-8తో సో ద్వి కుంకురో (చెన్నై)పై నెగ్గడంతో హంటర్స్ జట్టు 1-1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్) 12-15, 12-15తో సిమోన్ సాంతోసో (చెన్నై) చేతిలో ఓడిపోయాడు. దాంతో హంటర్స్ 1-2తో వెనుకబడింది. మహిళల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో పీవీ సింధు (చెన్నై) 15-8, 14-15, 15-5తో సుపనిద (హైదరాబాద్)ను ఓడించింది.
దాంతో చెన్నై జట్టుకు రెండు పాయింట్లు లభించడంతోపాటు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయం ఖాయమైంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో కార్‌స్టెన్ మొగెన్‌సన్-మార్కిస్ కిడో (హైదరాబాద్) జంట 15-12, 15-12తో క్రిస్ అడ్‌కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జోడీని ఓడించి రెండు పాయింట్లు సాధించింది. దాంతో చెన్నై ఆధిక్యం 3-4కి తగ్గింది.
నేడు సైనా X సింధు పోరు?
సోమవారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌తో అవధ్ వారియర్స్ (లక్నో) తలపడుతుంది. చెన్నై జట్టులో పీవీ సింధు, లక్నో జట్టులో సైనా నెహ్వాల్ ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో వీరిద్దరి మ్యాచ్ కోసం అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే గాయంతో బాధపడుతున్న సైనా ఈ మ్యాచ్‌లో ఆడుతుందో లేదో వేచి చూడాలి. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో ముంబైతో హైదరాబాద్ ఆడుతుంది.