సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జూనియర్ కాలేజి కబడ్డీ టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో తపస్య జూనియర్ కాలేజి విజేతగా నిలిచింది. అండర్-19 హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో తపస్య కాలేజి 27-22తో బి.ఆర్.అంబేద్కర్ జూనియర్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. తపస్య జట్టులో దుర్గా ప్రసాద్, అక్షయ్, ఆకర్ష్ జైస్వాల్ రాణించారు. అంబేద్కర్ జట్టు తరఫున రాజేందర్, మహేశ్ మెరుగ్గా ఆడారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తపస్య జట్టు 20-14తో కేశవ్ మెమోరియల్ కాలేజిపై గెలుపొందగా, అంబేద్కర్ కాలేజి జట్టు 22-13తో భవాన్‌స కాలేజిపై నెగ్గింది.
మూడో స్థానం కోసం జరిగిన పోరులో కేశవ్ మెమోరియల్ జట్టు 26-10తో భవాన్‌స జూనియర్ కాలేజిని ఓడించింది. బాలికల విభాగంలో న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజి టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఈ జట్టు 24-23తో వనిత మహావిద్యాలయపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత కబడ్డీ జట్టు ఆటగాడు మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఫిజికల్ డెరైక్టర్లు వడిరాజ్, రాజేందర్ ప్రసాద్, రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.